కర్నూలులో హైకోర్టు ఏర్పాటు అంత ఆషామాషీ కాదు.... జగన్ ఏం చేస్తారో...?
30,000 రైతులు భూములు ఇచ్చారని... అందువల్ల అమరావతిని అభివృద్ధి చేసి వాళ్లకు తగిన న్యాయం చేయాలని టీడీపీ చెబుతుండగా.. వైసీపీ 30 గ్రామాల ప్రజలు ఇచ్చిన 30,000 ఎకరాల గురించి ఆలోచిస్తే 13 జిల్లాల ప్రజలు అన్యాయమైపోతారని చెబుతోంది. కర్నూలుకు హైకోర్టు తరలింపు జరిగితే అక్కడ పెద్దగా అభివృద్ధి జరగదు. కానీ గతంతో పోలిస్తే ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతాయి.
రియల్ ఎస్టేట్ అభివృద్ధి జరగడంతో పాటు సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధి కర్నూలులో జరిగే అవకాశం ఉంటుంది. అయితే గవర్నర్ ఆమోద ముద్ర వేసినంత మాత్రాన హైకోర్టు తరలింపు సాధ్యమా....? అంటే అంత సులువుగా కాదనే చెప్పాలి. కొన్ని నెలల క్రితం హైకోర్టు తరలింపు గురించి జగన్ సర్కార్ తీర్మానం చేస్తే కేంద్రం అంగీకరించేలా చేస్తామని రాయలసీమ బీజేపీ నేతలు తెలిపారు.
అయితే ఇప్పుడు హైకోర్టు తరలింపు గురించి బీజేపీ నేతలు నోరు మెదపడం లేదు. హైకోర్టు తరలింపుకు కేంద్ర న్యాయ శాఖ అమోదం తెలపాల్సి ఉంది. కేంర న్యాయ శాఖ సుప్రీం కోర్టుకు అనుమతి కోరాలి. సుప్రీం కోర్టు న్యాయమూర్తుల బృందాన్ని నియమించి హైకోర్టు తరలింపుకు గల కారణాల గురించి విచారణ జరుపుతుంది. అందువల్ల జగన్ హైకోర్టును తరలించడం అంత ఆషామాషీ కాదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. హైకోర్టు తరలింపును అడ్డుకోవడానికి టీడీపీ ఇప్పటికే ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. హైకోర్టు తరలింపు విషయంలో చివరకు ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.