మోడీ చెప్పినా జగన్ పట్టించుకోడా? సాక్షి చెబుతున్నది అదేగా..?
దీంతో ఇక జగన్ తప్పనిసరిగా ఐదో తరగతి వరకూ తెలుగు మీడియం ఉంచాల్సిందేనంటూ కొన్ని పత్రికలు రాసుకొచ్చాయి. అయితే దీనికి కౌంటర్ గా సాక్షి ఓ కథనం ప్రచురించింది. దీని ప్రకారం కేంద్రం విద్యావిధానం అన్నది కేవలం సూచనలు మాత్రమే దాన్ని పాటించి తీరాలన్న రూలేమీ లేదని సాక్షి కథనం చెబుతోంది. ఈ మేరకు కొందరు న్యాయనిపుణుల సలహాలు కోట్ చేస్తూ కథనం ఇచ్చింది.
దీని ప్రకారం.. ఏ పత్రంలోనైనా సాధ్యమైనంత వరకు, సాధ్యమైతే అని పేర్కొంటే అదెప్పుడూ తప్పనిసరి మేండేటరీ కాదట. కొత్త విధానంలో కూడా మాధ్యమం విషయంలో ‘యాజ్‌పార్ యాజ్ ప్రాక్టికబుల్’ అని పేర్కొన్నారు కాబట్టి ఇది తప్పనిసరి కాదట. అంతే కాదు.. గతంలో ఆంగ్ల మాధ్యమం విషయంలో రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం కూడా మాధ్యమం మాతృభాషలోనే ఉండాలన్నది మేండేటరీ కాదు అది మార్గదర్శకమే అని హైకోర్టు కూడా స్పష్టం చేసిందని సాక్షి కథనం గుర్తు చేసింది. విద్యార్థుల అభీష్టం మేరకు మాధ్యమాన్ని అమలుచేయాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిందని తెలిపింది.
ప్రభుత్వం మాధ్యమంపై విద్యార్థుల అభిప్రాయాన్ని కోరితే 96 శాతానికి పైగా ఆంగ్ల మాధ్యమానికే ఆప్షన్ ఇచ్చారు. తెలుగు మీడియంను కోరుకున్న వారు 3.05 శాతం మంది ఉండగా ఇతర భాషా మాధ్యమాన్ని కోరుకున్న వారు 0.78 శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలో కూడా విద్యార్థులు కోరుకున్న మాధ్యమమే అమల్లోకి వస్తుందని ఓ న్యాయనిపుణుడు అభిప్రాయపడినట్టు సాక్షి కథనం చెబుతోంది. దీన్ని బట్టి చూస్తే కేంద్ర విద్యావిధానం ఎలా ఉన్నా సరే.. ఏపీలో మాత్రం ఒకటో తరగతి నుంచి ఆంగ్ల విద్యావిధానం బోధంచే ఆలోచనతో జగన్ ఉన్నట్టు అర్థమవుతోంది. అంటే ఈ విషయంలో జగన్ మోడీ మాట వినే పరిస్థితి లేదన్నమాట. చూడాలి ఏం జరుగుతుందో..?