తెలంగాణ జిల్లాల్లో కరోనా టెర్రర్.. !

NAGARJUNA NAKKA

హైదరాబాద్‌ని ఆనుకొని ఉన్న జిల్లాలను కరోనా హడలెత్తిస్తోంది. రోజురోజుకూ పెరుగుతున్న కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో పొరుగు రాష్ట్రాల సరిహద్దు ఎక్కువగా ఉన్న జిల్లాలను కరోనా కాటేస్తోంది. మొత్తంగా 33 జిల్లాలను చుట్టేసిన వైరస్, గ్రామాలకు చాపకింద నీరులా విస్తరిస్తూ గుండెల్లో గుబులు పుట్టిస్తోంది.

 

హైదరాబాద్ లో కొంత కట్టడి చేయడం... జనం జాగ్రత్తగా ఉండటంతో వైరస్ కొంత తగ్గుముఖం పట్టినా.... ఇప్పుడు జిల్లాలు హాట్ స్పాట్ లుగా మారిపోతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్‌ చుట్టూ ఉన్న రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, మహబూబ్ నగర్, జిల్లాలలో కేసులు పెరిగిపోతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో సగటున 200 కేసుల వరకు నమోదవుతున్నాయి. ఇక పొరుగున ఉన్న  సంగారెడ్డి జిల్లాలో గతవారం 966  కేసులు నమోదు కాగా..ఇప్పుడు 1308కి పెరిగిపోయాయి. ఒక్కరోజే 250పై చీలుకు కేసులు నమోదు అయ్యాయంటే సంగారెడ్డి జిల్లాలో కరోనా వ్యాప్తి ఎంత వేగంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. సిద్దిపేట జిల్లాలో ఒకప్పుడు ఒక్క కేసు కూడా లేదు... కానీ ఇప్పుడు సిద్దిపేటలో 272 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి హైదరాబాద్ వెళ్లే వారి సంఖ్య ఎక్కువే. దీనికి తోడు మెదక్ జిల్లా నుండి పొరుగు రాష్ట్రాల రాకపోకలు కూడా ఎక్కువగా ఉండటం వైరస్ వ్యాప్తికి కారణం అంటున్నాయి అధికార వర్గాలు. 

 

గతంలో గ్రేటర్ తరువాత... సూర్యాపేట జిల్లాలో ఎక్కువ కేసులు నమోదు అయ్యాయి. సీఎస్.. డీజీపీ లను గ్రౌండ్ లెవల్‌కి పంపడంతో కరోనా కంట్రోల్ అయ్యింది. అయితే, ఈనెల 20 నుంచి 26వరకు అక్కడ అత్యధికంగా 146 కేసులు నమోదయ్యాయి. మే 22 వరకు 83 కరోనా కేసులు నమోదు కాగా... ఇవాళ్టికి 432 కేసులు నమోదు అయ్యాయి. కరోనా బారిన పడిన వారికి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో వైద్య సేవలు అందించేందుకు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కోవిడ్ బాధితుల కోసం సూర్యాపేటలో 35 పడకలను కేటాయించారు.16 మంది వైద్య సిబ్బందిని నియమించారు.

 

జగిత్యాల జిల్లాలో ఒక్క రోజే 18 కేసులు నమోదయ్యాయి. గత నాలుగు రోజుల నుండి స్వల్పంగా కేసులు పెరుగుతున్నాయి. జిల్లాలో ఇప్పటి వరకు  మొత్తం 299 కరోన కేసులు ఉన్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటీవలే ఒక్కరోజే 34 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటి వరకు మొత్తం398 కేసులు నమోదు అయ్యాయి. కరీంనగర్ జిల్లాలో గత నాలుగు రోజుల నుండి సెంచరీకి చేరువలో నమోదు అవుతున్నయి కరోనా కేసులు.

 

కరోనా కట్టడికి ట్రేసింగ్ ముఖ్యమంటోంది వైద్య బృందం. హైదరాబాద్ నుండి జిల్లాలకు వెళ్లే వారిని హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలని చెబుతోంది. అలా అయితోనే కరోనాను నియంత్రించగలమని వైద్యులు సూచిస్తున్నారు.  జిల్లాల్లో కేసులు పెరుగుతుండడంతో ప్రభుత్వం అటువైపు ఫోకస్ పెట్టింది.  కేసుల పెంపునకు అనుగుణంగా, ఆయా జిల్లాలో వసతులు..వైద్యం సదుపాయాలు పెంచే పనిలో పడింది. అన్నీ జిల్లాల స్థాయిలో సమీక్షలు జరపాలని ఆరోగ్యశాఖ మంత్రిని ఆదేశించారు సీఎం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: