ప్రజలకు శుభవార్త... కరోనా వ్యాక్సిన్ వచ్చేది ఎప్పుడంటే....?

Reddy P Rajasekhar

భారత్ పై కరోనా వైరస్ పంజా విసురుతోంది. దేశంలో ప్రతిరోజూ రికార్డు స్థాయిలో నమోదవుతున్న కేసులు ప్రజల్లో భయాందోళనను పెంచుతున్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే వైరస్ నియంత్రణ సాధ్యమవుతుందని శాస్త్రవేత్తలు, వైద్యులు అభిప్రాయపడుతున్నారు. వ్యాక్సిన్‌ పరీక్షలు విజయవంతమైతే అక్టోబర్‌ నాటికి 5 కోట్ల మందికి రెండు డోసుల వ్యాక్సిన్లను సరఫరా చేస్తామని ఫైజర్ సంస్థ తాజాగా కీలక ప్రకటన చేసింది. 
 
2021 చివరినాటికి 130 కోట్ల వ్యాక్సిన్‌ డోసుల సరఫరాకు ఫైజర్‌ ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. 2021 నుంచి ఏడాదిలోగా 100 కోట్ల వరకూ వ్యాక్సిన్‌ డోసులను అందుబాటులోకి తీసుకురావాలని మోడర్నా కసరత్తు కొనసాగిస్తోందని ఆ కంపెనీ సీఈఓ స్టెఫానే బాన్సెల్‌ కీలక ప్రకటన చేశారు. మోడెర్నా, ఫైజర్ కంపెనీలు తయారు చేసిన వ్యాక్సిన్లను 30,000 మందిపై పరీక్షిస్తున్నాయి. వ్యాక్సిన్ పరీక్షలు విజయవంతమైతే ఈ సంవత్సరం చివరినాటికి పెద్దసంఖ్యలో వ్యాక్సిన్లను అందుబాటులోకి తీసుకువస్తామని ఈ సంస్థల నుంచి ప్రకటన వెలువడింది. 
 
ఇతర దేశాలతో పోలిస్తే అమెరికాలో పెద్ద సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటంతో ట్రంప్‌ యంత్రాంగం తుది పరీక్షల కోసం సన్నాహాలు చేస్తోంది. మోడెర్నాకు అమెరికా ప్రభుత్వం కరోనా వ్యాక్సిన్ కోసం రూ .7500 కోట్ల నిధులను అందించింది. అమెరికా ప్రభుత్వం ఫైజర్ వ్యాక్సిన్ సక్సెస్ అయితే 5 కోట్ల మందికి రూ 15,000 కోట్లకు వ్యాక్సిన్లను విక్రయించేందుకు ఒప్పందాలను కుదుర్చుకుంది. 
 
మరోవైపు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా కరోనా వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయి. ఈ వ్యాక్సిన్లలో దాదాపు 20 వ్యాకిన్లు మానవ పరీక్షల దశకు చేరుకున్నాయి. కరోనా వ్యాక్సిన్‌ గురించి జాన్సన్‌ అండ్‌ జాన్సన్ ఈ వారంలో మానవ పరీక్షలను చేపట్టనుంది. ఈ పరీక్షల్లో సక్సెస్ అయితే మరో మూడు నెలల్లో భారీ స్ధాయిలో తుది పరీక్షలు నిర్వహించాలని ఈ సంస్థ భావిస్తోంది. కొందరు శాస్త్రవేత్తలు ఈ సంవత్సరం చివరినాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రాదని చెబుతున్నా పలు సంస్థల ఫలితాలు ఆశాజనకంగా ఉండటంతో వ్యాక్సిన్ రావడం ఖాయమేనని తెలుస్తోంది. 
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: