ఏపీలోని ఆ ప్రాంతంలో పూర్తిస్థాయి లాక్ డౌన్...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. రాష్ట్రంలో ఈరోజు నమోదయ్యే కేసులతో కరోనా కేసుల సంఖ్య లక్ష మార్కును దాటే అవకాశం ఉంది. గత ఐదు రోజులుగా వేల సంఖ్యలో నమోదవుతున్న కేసులు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. రాష్ట్రంలో నిన్న ఒక్కరోజే 7,627 కేసులు నమోదయ్యాయి. నిన్న ఒక్కరోజే 56 మంది వైరస్ భారీన పడి మృతి చెందారు. కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో పలు జిల్లాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. 
 
వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కడప, నెల్లూరు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతుండగా తాజాగా ప‌శ్చిమ ‌గోదావ‌రి జిల్లాలోని కొవ్వూరులో పూర్తిస్థాయి లాక్‌డౌన్ ను అమలు చేయనున్నట్టు అధికారులు ప్రకటించారు. ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలోని ని ఏలూరు, తాడేప‌ల్లి గూడెం, భీమ‌వ‌రం ప్రాంతాల్లో లాక్ డౌన్ అమలవుతోంది. నేటి నుండి అధికారులు ఉదయం 6 నుంచి 9 గంటల వరకు మాత్రమే అనుమతిస్తూ కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయనున్నారు. 
 
అధికారులు కొవ్వూరులో నిత్యావసర సరుకులు, పాల కేంద్రాలు, కూరగాయలకు మాత్రమే అనుమతులు ఇచ్చారు. 9 గంటల తరువాత ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీగా కేసులు నమోదవుతూ ఉండటంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు రాష్ట్రంలో మృతుల సంఖ్య వెయ్యి దాటింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1041 మంది వైరస్ సోకి మృతి చెందారు. 
 
ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో పూర్తిస్థాయిలో సఫలం కావడం లేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీలో ఐదు రెట్లు ఎక్కువగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. వైద్యులు రాష్టంలో వైరస్ పురోగమన స్థితిలో ఉందని.... ఆగష్టు రెండో వారం తరువాత కేసులు తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు. రాష్ట్రంలోని పలు పల్లెల్లో కూడా పదుల సంఖ్యలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: