వంగ‌వీటికి టీడీపీలో ఆ సీటు ఫిక్స్ చేసిన బాబు...!

VUYYURU SUBHASH

దివంగత వంగవీటి రంగా...ఏపీ రాజకీయాల్లో పరిచయం అక్కర్లని పేరు. రాష్ట్రంలో అత్యధికంగా ఉన్న కాపు సామాజికవర్గానికి పెద్ద దిక్కుగా నడిచిన నాయకుడు. ఇక ఆయన వారసుడుగా వంగవీటి రాధా రాజకీయాల్లోకి వచ్చి...తొలుత 2004లో తూర్పు నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి విజ‌యం సాధించారు. ఆ తర్వాత నుంచే రాధా రాజకీయంగా  తప్పటడుగులు వేయడం మొదలుపెట్టారు.

 

2009లో ప్రజారాజ్యంలోకి వెళ్ళి విజయవాడ సెంట్రల్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఓడిపోయాక జగన్ పెట్టిన వైఎస్సార్‌సీపీలోకి వెళ్ళి 2014 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే 2019 ఎన్నికలోచ్చేసరికి రాధాకు విజయవాడ తూర్పు గానీ, మచిలీపట్నం పార్లమెంట్ సీటు గానీ ఇవ్వొచ్చని ప్రచారం జరిగింది. కానీ రాధా అలాంటి ఆప్షన్ ఏమి తీసుకోకుండా, జగన్‌పై తీవ్ర విమర్శలు చేసి చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీలో చేరిపోయారు.

 

పార్టీ చేరినా కూడా ఎన్నికల్లో మాత్రం పోటీ చేయలేదు. పలుచోట్ల టీడీపీ అభ్యర్ధుల గెలుపు కోసం ప్రచారం చేశారు. అయితే ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయి, జగన్ భారీ మెజారిటీతో అధికారంలోకి రావడంతో రాధా సైలెంట్ అయిపోయారు. అలా సైలెంట్ అయిన రాధా అమరావతి ఉద్యమంలో యాక్టివ్‌గానే పాల్గొంటున్నారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నా రాధా, వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. 

 

చంద్రబాబు, రాధాని తూర్పుగోదావరి జిల్లాలోని రామచంద్రాపురం నియోజకవర్గం పంపించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. తోట త్రిమూర్తులు వైఎస్సార్‌సీపీ వైపు వెళ్లిపోవడంతో, రామచంద్రాపురంలో టీడీపీని నడిపించే సరైన నాయకుడు లేకుండా పోయాడు. దీంతో కాపుల ప్రభావం ఎక్కువగా ఉన్న రామచంద్రాపురం నియోజకవర్గానికి రాధాని పంపిస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని తెలుస్తోంది. 

 

పైగా రామచంద్రాపురం ఉన్న అమలాపురం పార్లమెంట్ పరిధిలో టీడీపీ విజయావకాశాలు మెరుగు పడే అవకాశాలున్నాయని బాబు యోచిస్తున్నట్లు సమాచారం. అన్నీ అనుకున్నట్లు జరిగితే నెక్ట్స్‌ ఎన్నికల్లో రాధాని రామచంద్రాపురం బరిలో దించడం ఖాయమని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: