ఏపీలో జగన్ పరువు తీస్తున్న కరోనా... టీడీపీ విమర్శల వర్షం...?

Reddy P Rajasekhar

ఏపీలో కరోనా వైరస్ విలయం కొనసాగుతోంది. మార్చి నెల మూడవ వారం నుంచి రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. మే 31 వరకు జగన్ సర్కార్ లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు చేయడంతో ఏపీలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. అన్ లాక్ 1.0 సడలింపుల తర్వాత కేసుల సంఖ్య పెరిగినా ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పరిస్థితి అదుపులోనే ఉండేది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఏపీలో పరిస్థితి మారిపోయింది. 

 


 
రాష్ట్రంలో వేల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. తెలంగాణలో ప్రతిరోజూ 1500కు అటూఇటుగా కేసులు నమోదవుతుంటే ఏపీలో దాదాపు 8,000 కేసులు నమోదు కావడంతో ప్రజలు రోడ్లపై అడుగు పెట్టాలంటే భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 10,038 కరోనా కేసులు నమోదయ్యాయి. ఎనిమిది వేలకు పైగా కేసులతో కర్నూలు, గుంటూరు ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

 


 
రాష్ట్రంలో భారీగా నమోదవుతున్న కేసుల వల్ల ప్రభుత్వంపై టీడీపీ విమర్శల వర్షం కురిపిస్తోంది. చంద్రబాబు, లోకేష్, రామ్మోహన్ నాయుడు, మాగంటి రామ్జీ తదితర నేతలు ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయని ఆరోపణలు చేస్తున్నారు. కరోనా వైరస్ జ్వరం లాంటిదయితే వైసీపీ నేతలు వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు ఎందుకెళ్తున్నారు..? అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ప్రజలు నిండు ప్రాణాలు కోల్పోతున్నారని విమర్శలు చేస్తున్నారు. 

 


 
కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం వల్లనే ఇంతటి విపత్కర పరిస్థితులు ఏర్పడ్డాయని... వేల సంఖ్యలో కేసులు పెరిగిపోతూ మరణ మృదంగం మోగిస్తుంటే పాలకలకు కనిపించడం లేదని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసులు పెరగడం వల్ల ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతూ అధికార పార్టీ పరువు పోతోంది. జగన్ సర్కార్ రాష్ట్రంలో కరోనా కట్టడి కోసం తగిన చర్యలు తీసుకోకపోతే ఏపీ మరో మహారాష్ట్ర అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: