చైనా వాళ్లు దేవుడిగా కొలిచే... మన భారతీయ వైద్యుని కథ తెలుసా...?
ఇప్పుడంటే.. ఇండియా చైనా ఘర్షణలతో దేశమంతటా చైనా వ్యతిరేక వాతావరణం నెలకొని ఉంది కానీ.. చైనాతో మనకు స్వాతంత్ర్యానికి పూర్వం మంచి సంబంధాలే ఉండేవి. చైనా సైన్యం కోసం మన దేశం నుంచి చైనా వెళ్లిన ఓ భారతీయ వైద్యుడు.. అక్కడి వారి గుండెల్లో ఇప్పటికీ నిలిచిఉన్నాడు.. మన వైద్యునికి గుర్తుగా వాళ్లు ఓ పాలరాతి విగ్రహం పెట్టుకున్నారు.
ఇంతకీ ఆ వైద్యుడు ఎవరు.. ఏమా కథ.. తెలుసుకుందాం పదండి.. అవి.. 1938 నాటి రోజులు.. ఇండియాలో స్వాతంత్ర్యపోరాటం జరుగుతోంది. అటు చైనాలో మావో నాయకత్వాన కమ్యూనిస్టుల విప్లవ పోరాటం ప్రజ్వలిస్తోంది. జపాన్ చైనాపై దురాక్రమణకి పాల్పడింది. అప్పట్లో చైనాకి మంచి డాక్టర్లు లేరు. వైద్యుల్ని పంపి ఆదుకోవాలని మిత్రదేశాల్ని మావో, ఇతర నాయకులు అర్థించారు.
ఆనాటి చైనా జనరల్ ఛూటే మన నెహ్రూకి లేఖ రాశారు. అప్పుడు నెహ్రూ కోరికపై ద్వారకానాథ్ శాంతారామ్ కోట్నీస్ అనే వైద్యుడితో పాటు అయిదుగురు డాక్టర్ల బృందాన్ని చైనా కు భారత జాతీయ కాంగ్రెస్ పంపింది. అప్పటికి డాక్టర్ కోట్నీస్ వయస్సు కేవలం 28 సంవత్సరాలు. సంచార వైద్యశాలల్లో సైనికులకు నిరంతరం చికిత్స చేస్తూనే వున్నారు. కోట్నీస్ దీక్షనీ, అంకితభావాన్నీ చూసి సైనికులూ, చైనా పార్టీ నాయకులూ చలించిపోయారు. రాత్రీ పగలూ తేడా లేకుండా గాయపడిన వందలాది సైనికులకు కోట్నీస్ వైద్యం చేశారు.
దాదాపు అయిదేళ్లు కోట్నీస్ అవిశ్రాంతంగా పనిచేశారు. 1941 డిసెంబర్ లో కోట్నీస్ అక్కడే ఓ నర్సును పెళ్లి చేసుకున్నారు. ఆ బిడ్డకి ఇన్‌హువా అని పేరు పెట్టారు. ఇన్ అంటే ఇండియా, హువా అంటే చైనా అని అర్ధం. అయితే అవిశ్రాంతంగా పని చేయడం వల్ల కొడుకు పుట్టేనాటికే కోట్నీస్ ఆరోగ్యం పాడయింది. 1942 డిసెంబర్ 9వ తేదీన ద్వారకానాథ్ కోట్నీస్ కన్నుమూశారు. నాన్ క్వాన్ అనే గ్రామంలోని మృతవీరుల శ్మశానవాటికలో కోట్నీస్‌ని ఖననం చేశారు. “ఆర్మీ సహయం చేసే చేతీనీ, చైనా ఒక మిత్రుణ్ణీ కోల్పోయింది. కోట్నీస్ అంతర్జాతీయ స్ఫూర్తి మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచివుంటుంది “ అన్నారు మావో. కోట్నీస్ గౌరవ సూచకంగా అతని శిల్పాన్ని ప్రతిష్టించారు. మ్యూజియం ఏర్పాటు చేశారు. అందులో కోట్నీస్ వాడిన వైద్య పరికరాలు, ఆయన హేండ్‌బుక్, చైనా పార్టీ నాయకులతో, డాక్టర్లతో వున్న ఫోటోలు భద్రపరిచారు.