షాకింగ్.... ఒక మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడో తెలుసా....?
మనిషి మెదడు ఆలోచనల పుట్ట. కొంచెం ఖాళీ సమయం దొరికిందంటే చాలు మనిషి ఏదో ఒక విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. మరి సగటున ఒక మనిషి రోజుకు ఎన్ని ఆలోచనలు చేస్తాడు...? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తూ ఉంటుంది. మనం ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉన్నా ఏదో ఒక ఆలోచన మనసులో మెదులుతూ ఉంటుంది. మనకు తెలియకుండా కూడా మెదడు ఆలోచనలు చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే మనం నిద్రపోయినా మెదడు మాత్రం యాక్టివ్ గానే ఉంటుందని పరిశోధనల్లో తేలింది. నిద్రలో కూడా మనకు తెలియకుండానే మెదడు ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటుంది. పలువురు నిపుణులు సగటున రోజుకు 300 నుంచి 400 ఆలోచనలు వస్తాయని చెబుతున్నారు కానీ కెనడా క్వీన్స్ యూనివర్శిటీకి చెందిన శాస్త్రవేత్తలు మనిషి రోజుకు 6 వేల వరకు ఆలోచనలు చేస్తాడని తేల్చారు.
శాస్త్రవేత్తలు వ్యక్తి ఆలోచనలపై అనేక రకాల పరిశోధనలు చేసి ఈ విషయాలను వెల్లడించారు. పలువురు వ్యక్తులను పరిశీలించి మనిషి రోజులో ఎన్ని ఆలోచనలు చేస్తాడో శాస్త్రవేత్తలు లెక్కించారు. శాస్త్రవేత్తలు మనిషి ఆలోచనలను లెక్కించేందుకు ఒక కొత్త పద్ధతిని కనిపెట్టారు. ఈ పద్ధతికి ‘థాట్ వర్మ్’ అనే పేరు పెట్టారు. అయితే మనిషి ఆలోచనల గురించి శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి పరిశోధనలు చేయాల్సి ఉంది.
శాస్త్రవేత్తలు థాట్ వర్మ్ పద్ధతి ద్వారా మనిషి ఆలోచన మొదలైనప్పటి నుంచి చివరి ఆలోచన వరకు గణించి సంఖ్యను నిర్ధారిస్తారు. పలువురు వ్యక్తులపై చేసిన పరిశోధనల ద్వారా సగటున మనిషికి 6,000 ఆలోచనలు వస్తాయని నిర్ధారించారు. అయితే మనిషి వయస్సు, జెండర్ లను బట్టి ఆలోచనల సంఖ్యలో మార్పులు ఉంటాయి.