కరోనా సోకిన వాళ్లు డిశ్చార్జ్ తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలివే...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నెల రోజుల క్రితం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 200కు అటూఇటుగా కేసులు నమోదు కాగా ప్రస్తుతం వేలల్లో నమోదవుతున్నాయి. వైరస్ శరవేగంగా వ్యాప్తిస్తూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గతంలో పట్టణాలకే పరిమితమైన వైరస్ ప్రస్తుతం గ్రామాల్లో కూడా వేగంగా వ్యాపిస్తోంది. అయితే కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన తర్వాత బాధితులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి...? అనే ప్రశ్న చాలామందిని వేధిస్తోంది. 
 
కరోనా లక్షణాలు ఉన్నవాళ్లు పూర్తిగా కోలుకోవడానికి 14 రోజుల సమయం పడుతుంది. లక్షణాలు లేనివాళ్లకు మాత్రం 10 రోజుల్లో వైరస్ ప్రభావం తగ్గుతుంది. అయితే లక్షణాలు ఉన్నవాళ్లైనా, లేనివాళ్లైనా డిశ్చార్జ్ అయిన తర్వాత తప్పనిసరిగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కోలుకున్న వాళ్లు ఇంటికి వెళ్లిన తరువాత అనారోగ్యంగా అనిపించినా, ఆక్సిజన్ శాతం తగ్గినా, కరోనా లక్షణాలు కనిపించినా డిశ్చార్జి కార్డులో రాసిన ఫోన్ నెంబర్లను కాల్ చేసి తెలియజేయాలి. 
 
డిశ్చార్జి అయిన తరువాత బాధితుడు కనీసం ఏడు రోజుల పాటు హోం క్వారంటైన్ లో ఉండాలి. 7 రోజుల వరకు ఇంటికి ఇతరులను ఆహ్వానించకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోను కొన్ని రోజుల పాటు జనావాసాల్లో సంచరించకుండా మాస్క్ ను తప్పనిసరిగా ధరించాలి. గర్భిణిలు, పిల్లలు, వయసు మీద పడ్డ వారు ఇంట్లో ఉంటే వాళ్లకు దూరంగా ఉండాలి. 
 
డిశ్చార్జ్ అయిన వాళ్లు ప్రత్యేక గదిలో ఉండాలి. ఆ వ్యక్తి ఉపయోగించిన బాత్ రూమ్ ను 7 రోజుల పాటు ఇతరులు వినియోగించకూడదు. గదిని నాలుగు గంటలకు ఒకసారి తప్పనిసరిగా శానిటైజ్ చేయాలి. కరోనా సోకిన వ్యక్తులు తాకిన వస్తువులను కుటుంబ సభ్యులు నేరుగా తాకకూడదు. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తులు అవసరమైనప్పుడు ప్లాస్మా ఇవ్వడానికి సిద్ధంగా ఉండాలి. ప్లాస్మా వల్ల ఇతరులు కూడా వైరస్ నుంచి సులువుగా కోలుకునే అవకాశాలు ఉంటాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: