నేపాల్ ప్రధాని రామాయణం చూద్దాం రండి రండి..!

Suma Kallamadi

శ్రీ రాముడు మనవాడే అని త్రేతాయుగం నుంచి నిరంతరం తనివితీరా కొలుచుకుంటూ తరిస్తుంటే, కాదు రాముడు తమవాడని నేపాల్‌ ప్రధాని ఓలీ కొత్త గోల మొదలుపెట్టాడు. కాలాపానీ సహా ప్రస్తుతం మనదేశంలో ఉన్న ఇంకో రెండు ప్రాంతాలు తమవేనని ఈమధ్యే కొట్లాటకు దిగి కొంత చేతులు కాల్చుకున్నా పట్టువిడవకుండా బెట్టు సాగిస్తున్నాడు. చైనాతో చేరి చెడిపోతున్నాడని విమర్శలు వస్తున్నా వినిపించుకోకుండా చెలరేగిపోతున్నాడు. కరోనా సమస్యలతోనే ఉక్కిరిబిక్కిరి అవుతుంటే, అసలు అయోధ్య తమదేనంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నాడు. వేల సంవత్సరాల హిందూ సంస్కృతిని డ్రాగన్‌ నోటికి ఎరగా వేస్తున్నాడు.


ప్రకోప ప్రచారాలతో కోట్లమంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే తతంగానికి నేపాల్‌ ప్రధాని ఉద్దేశపూర్వకంగానే తెరతీశాడు. తన పాలనలో పొరపాట్లపై తలెత్తిన గొడవల నుంచి ప్రజల దృష్టి మళ్లిస్తున్నాడు. ఇలాంటి వివాదాలను కావాలనే ఓలీ రేకెత్తిస్తున్నాడని ప్రత్యర్థి వర్గమూ ఆయన ధోరణిని ఎండగడుతోంది. నేపాల్‌ కమ్యూనిస్ట్‌ పార్టీ నేత ప్రచండ చేస్తున్న బహిరంగ విమర్శలు, రాజకీయం వెనక భారత్‌ హస్తం ఉందనే అనుమానంతోనే ఓలీ ఇలాంటి వ్యాఖ్యలకు తెగబడుతున్నాడన్నది జగమెరిగిన సత్యం. అసలు అప్పటి ఆర్యావర్తాన్ని పరిగణనలోకి తీసుకుంటే నేపాల్‌ అనేదే లేదని, అది భారత్‌లో భాగమని ఇంకొందరు గుర్తుచేస్తున్నారు. మరోవైపు భౌగోళిక వివాదంపై మరింత పరిశోధన జరగాల్సి ఉందన్నదే తమ ప్రధాని ఉద్దేశమంటూ నేపాల్‌ విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ, రేగిన గాయానికి మందుపూసే పని మొదలుపెట్టింది.

 

రాముడి అత్తగారిల్లు ఉన్న జనకపురి నేపాల్‌లోనే ఉందన్న అంశంపై ఎవరికీ పేచీ ఉన్నట్లు లేదు. బీర్‌గంజ్‌ పక్కన ఉన్న అయోధ్యకే జనకపురి దగ్గరగా ఉంది కాబట్టి అదే అసలు అయోధ్య... అక్కడెక్కడో ఉత్తర్‌ ప్రదేశ్‌ అయోధ్య నుంచి రాముడు వచ్చే అవకాశమే లేదనేది ఓలి తర్కం కాబోలు. ఇక జటాయువు మన భద్రాచలం అడవుల్లోనే ఉండేవాడంటే ఇంకేమంటాడో? ఇప్పుడు ఓలీపై చాలా బాధ్యతలు పడ్డాయి. లంక ఎక్కడుందో, రావణాసురుడు ఎక్కడివాడో కూడా తేల్చాలి. రాముడినే అంటిపెట్టుకొని ఉన్న హనుమంతుడికీ ఒక ఊరు చూపించాలి. వానర సైన్యం చిరునామాలు చెప్పాలి. రామకీర్తనలన్నీ నేపాలీ భాషలోనే జరిగేవని నిరూపించాలి. లవకుశుల వారసత్వం నేపాల్‌ నేలపైనే ఉందని వెల్లడించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: