గవర్నర్ వద్ద ఆ రెండు బిల్లులు.. బీజేపీ ప్రయత్నం ఫలిస్తుందా.. ?

NAGARJUNA NAKKA

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారం తుది అంకానికి చేరింది. రెండు బిల్స్ గవర్నర్ వద్దకు చేరడంతో ఏం జరుగుతుందోననే ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే టీడీపీ బిల్స్ ఆమోదించవద్దని గవర్నర్ ను కోరుతుండగా... ఇప్పుడు బీజేపీ కూడా అదే లైన్ తీసుకుంది.

 

ఏపీలో కరోనా సమయంలోనూ ఆసక్తి కర రాజకీయ చర్చ సాగుతోంది. సీఆర్డీఏ యాక్ట్ రద్దు, అభివృద్ది వికేంద్రీకరణ కోసం ప్రభుత్వం తీసుకు వచ్చిన బిల్స్ ఇప్పుడు ఆ చర్చకు కారణం అవుతున్నాయి. గత నెలలో మండలిలో తీసుకు వచ్చిన ఈ బిల్స్ రెండు ఇప్పుడు గవర్నర్ వద్దకు చేరాయి. సాధారణ రోజుల్లో అయితే ప్రభుత్వం నుంచి వచ్చిన బిల్స్ ను గవర్నర్ ఆమోదంచడం లాంఛనమే. అయితే రాష్ట్రంలో ఉన్న రాజకీయ పరిస్థితులు, అభ్యంతరాలు, బిల్స్ పై కోర్టులో ఉన్న కేసుల తరుణంలో ప్రథమ పౌరుడు ఏం చేస్తారా అనే చర్చ జరుగుతోంది. గవర్నర్ ఆమోదం లాంచనమే అని ప్రభుత్వం భావిస్తుండగా....అంత సులభం కాదని ప్రతిపక్షాలు చెబుతున్నాయి. బిల్స్ సెలక్ట్ కమిటీలో ఉన్నాయని.....కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని టీడీపీ చెపుతోంది. ఇప్పటికే గవర్నర్ కు లేఖ రాసిన టీడీపీ ముఖ్యనేతలు...బిల్స్ విషయంలో రాష్ట్ర పతిని కూడా సంప్రదించాలని కోరుతున్నారు. 

 

ఇదే సమయంలో బీజేపీ నేతలు కూడా రంగంలోకి దిగారు. రెండు బిల్స్ ను ఆమోదించవద్దని గవర్నర్ ను కోరారు. ఈ మేరకు బిజెపి రాష్ట్ర అద్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ కు లేఖ రాశారు. మూడు రాజధానుల విషయం కోర్టులో కూడా ఉందని గవర్నర్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు విభజన చట్టంతో ఏర్పాటు అయిన రాజధానిని వికేంద్రీకరణ పేరిట మార్చడం తగదు అని కూడా కన్నా తెలిపారు. రాజధాని రైతులు చేస్తున్న నిరసన కార్యక్రమాలను కన్నా లేఖలో ప్రస్తావించారు.

 

ఇక్కడి వరకు అంతా బాగానే ఉన్నా...మరి గవర్నర్ పై బీజేపీ ఎలాంటి ఒత్తిడి తెస్తుంది అనేది ఆసక్తిగా మారింది. నిమ్మగడ్డను తొలగిస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్ తెచ్చిన్పప్పుడు గవర్నర్ ఆమోదం తెలిపారు. దీనిపై బీజేపీ అగ్రనేతలు కూడా కొంత అసంతృప్తి వ్యక్తం చేశారనే ప్రచారం జరిగింది. దీంతో ఇప్పుడు ప్రభుత్వం తెచ్చిన రెండు బిల్స్ విషయంలో అంత వేగంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉండదని నేతలు బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఆర్డినెన్స్ పై కోర్టు తీర్పులు.....ఇప్పుడు బిల్స్ పై ప్రభుత్వ ప్రయత్నాలు కేంద్ర పెద్దల దృష్టిలో ఉన్నాయని బీజేపీ నేతలు అంటున్నారు. అమరావతి కే తాము కట్టుబడి ఉన్నామని ఏపీ బీజేపీ చెబుతోంది....దీంతో ఇప్పుడు కేంద్రం వైపు నుంచి నరక్కు వచ్చే ప్రయత్నం కూడా జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: