మీడియా మంటలు: మీడియా హౌజుల్లో కరోనా భూకంపాలు..?
కరోనా.. ఇది ప్రభావం చూపని రంగం అంటూ ఉందా.. దీని కాటుకు బలై పోని వ్యవస్థ అంటూ ఉందా.. లేనేలేదనే చెప్పాలి. ఇక ప్రజాస్వామ్యంలో నాలుగో స్థంభంగా చెప్పుకునే మీడియాను కరోనా అతలాకుతలం చేసింది. ఇందులోనూ ప్రింట్ మీడియా సంగతి మరీ దారుణం. ఈ విషయాన్ని ఇదే మీడియా మంటలు కాలమ్ లో అనేక సార్లు చెప్పుకున్నాం.. అయితే అదంతా ప్రింట్ మీడియాలో పోతున్న ఉద్యోగాల గురించి... భవితవ్యం గురించి.. చెప్పుకున్నాం.
ఇక ఇప్పుడు ఈ మీడియా హౌజులన్నీ కరోనా కేంద్రాలుగా మారిపోతున్నాయి.. నిన్న మొన్నటి వరకూ ఉద్యోగం ఉంటుందా ఊడుతుందా అన్న భయాందోళన ఉద్యోగుల్లో ఉండేది.. ఇప్పుడు ఉద్యోగులు కూడా తమ పరిస్థితి అర్థం చేసుకున్నారు. కానీ ఇప్పుడు యాజమాన్యాలకు కొత్త సమస్య వచ్చి పడింది. దాదాపుగా మీడియా హౌజులన్నీ హైదరాబాద్ లోనే ఎక్కువగా కేంద్రీకృతం అయ్యాయి.
అలాంటి హైదరాబాద్ కరోనా రాజధానిగా తయారయ్యింది. దీంతో తక్కువ జీతాలు ఉన్న జర్నలిస్టులు... తామే ఉద్యోగాల నుంచి స్వచ్ఛందంగా ఊళ్లకు వెళ్లిపోతున్నారు. బతికి ఉంటే బలుసాకు తిని బతకొచ్చంటూ సొంత ఊళ్లకు పయనమవుతున్నారు. కరోనా తగ్గాక.. అంతా బాగుంటే మళ్లీ అప్పుడు రావచ్చన్న ఆలోచనతో ఇప్పుడైతే ఉద్యోగాలకు టాటా చెప్పేస్తున్నారు.
ప్రత్యేకించి 20 వేలు అంత కంటే తక్కువ వేతనం ఉన్న వారు.. పెళ్లాం, పిల్లలు వంటి బాధ్యతలు లేని కుర్ర జర్నలిస్టులు ఎక్కువగా ఇంటిబాట పడుతున్నారు. వారికి ఇళ్ల నుంచి కూడా బాగా ఒత్తిడి ఎక్కువైంది. ఏదో ఒక పని చేసుకుని బతికేయొచ్చు.. ముందు ఇంటికి రా బిడ్డా.. అన్న ఫోన్లు ఇళ్ల నుంచి పెరిగిపోయాయి. దీంతో మీడియా హౌజుల్లో ఇప్పుడు జర్నలిస్టుల కొరత ఏర్పడింది. ఏదో ఉన్న సిబ్బందితోనే మమ అంటూ నడిపించేస్తున్నాయి. ఈ కరోనా భూకంపాలు ఇంకెన్నాళ్లో..!?