జగన్ బాబాయి మర్డర్ కేసు.. సీబీఐ అయినా తేలుస్తుందా.. నానుస్తుందా...?
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య.. గత ఏడాది మార్చిలో.. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించింది. హాట్ టాపిక్ గా మారింది. జగన్ సొంత బాబాయిని చంపేశారన్న వార్త అప్పట్లో న్యూస్ ఛానళ్లకు గంటలకొద్దీ న్యూస్ టాపిక్ అయ్యింది. అది సాధారణ హత్య కాకపోవడం.. నిందితులు ఎవరో ఇప్పటి వరకూ తెలియకపోవడం.. దర్యాప్తు నెలల తరబడి కొనసాగడం.. ఈ హత్యను మరింత మిస్టరీగా మార్చాయి.
వై.ఎస్. వివేకానందరెడ్డి హత్య.. ఏడాది తర్వాత కూడా ఇంకా ఎన్నో చిక్కుముడులను విప్పలేకపోయింది. మొదట్లో వైసీపీయే దీనిపై సీబీఐ ఎంక్వయిరీ వేయాలని డిమాండ్ చేసింది. ఆ తర్వాత జగన్ సీఎం అయ్యాక సిట్ తో దర్యాప్తు సాగింది. సీబీఐ దర్యాప్తు అవసరం లేదు సిట్ సరిపోతుందని ప్రభుత్వం వాదిస్తున్నా.. మళ్లీ హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు సీబీఐ రంగంలోకి దిగింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ అధికారులు కడప జిల్లా ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో గతంలో ఈ కేసులో పనిచేసిన సిట్ బృందంతో సిట్టింగ్ వేశారు. జిల్లా ఎస్పీతో కూడా సమావేశమై కేసుకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నారు. మరి సిట్ బృందం సాల్వ్ చేయలేని మిస్టరీని సీబీఐ అయినా చేదిస్తుందా.. ? వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసును పరిష్కరిస్తుందా అన్నది చూడాలి.