అన్ లాక్ 2.0 : ఆ రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి వాళ్లే కారకులు....?

Reddy P Rajasekhar

చైనా నుంచి వ్యాప్తి చెందిన కరోనా వైరస్ ప్రపంచ దేశాలను గజగజా వణికిస్తోంది. మొదట్లో మన దేశంలో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా లాక్ డౌన్ సడలింపుల తర్వాత రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఏపీకి పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ప్రతిరోజూ వేలసంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. అయితే భారీ స్థాయిలో కేసులు నమోదు కావడానికి ఆసక్తికరమైన కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. 
 
కొందరు బాధ్యత లేకుండా ప్రవర్తించడం వల్లే కర్ణాటకలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొందరి నిర్లక్ష్యం మూలంగానే బెంగళూరులో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు క్వారంటైన్ నుంచి తప్పించుకోవాలనే ఉద్దేశంతో అధికారులకు తప్పుడు చిరునామాలు ఇస్తున్నారు. అందువల్లే బెంగళూరులో అధిక సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కర్ణాటకలో బెంగళూరుతో పాటు మరో 12 జిల్లాల్లో లాక్‌డౌన్‌ కొనసాగుతోంది. 
 
ఇతర రాష్ట్రాల నుంచి కర్ణాటకకు వచ్చేవాళ్లు 14 రోజులు హోం క్వారంటైన్‌ లో ఉండాలని ప్రభుత్వం నిబంధనలు విధించింది. అయితే కొందరు  తప్పుడు వివరాలు ఇచ్చి క్వారంటైన్ లో ఉండకుండా రోడ్లపై సంచరిస్తున్నారు. అధికారుల లెక్కల ప్రకారం కర్ణాటకలో 23 వేల మంది వివరాలు తప్పుగా ఇచ్చినట్లు అధికారులు గుర్తించారు. కర్ణాటక సర్కార్ ఏర్పాటు చేసిన క్వారంటైన్‌ కేంద్రాల్లో కొందరు తప్పుడు వివరాలతో పేర్లు నమోదు చేసుకున్నారు. 
 
అధికారులు నగరంలో ఇతర రాష్ట్రాల నుంచి నగరానికి వచ్చిన 69,297 మందిని హోమ్‌ క్వారంటైన్లో ఉండాలని సూచించారు. అయితే కేవలం 46,113 మంది మాత్రమే సరైన చిరునామా వివరాలు ఇచ్చారని అధికారుల విచారణలో తేలింది. అధికారులు వాళ్లను వెతికి పట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నా లాభం లేకుండా పోయింది. వాలంటీర్ల సాయంతో ప్రభుత్వం వీళ్లను గుర్తించేందుకు ప్రయత్నిస్తోంది. అధికారులు వీళ్ల వల్లే బెంగళూరులో లాక్ డౌన్ విధించాల్సిన పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: