ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు.. !
ఆంధ్రప్రదేశ్ లో రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ ఒక్క రోజే..2600 పాజిటివ్ గా తేలాయి. ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ లో మొత్తం కేసుల సంఖ్య 40 వేలు దాటింది. మరణాల సంఖ్య 500 దాటిపోయింది. కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రంలో 2,602 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో రాష్ట్రంలో ఉన్నవారికి 2,592 మందికి కరోనా సోకింది. మిగతా 10 కేసులు ఇతర రాష్ట్రాలు, విదేశాల నుంచి వచ్చిన వారికి సోకినట్లు నిర్ధారించారు. ఇప్పటిదాకా ఏపీలో కరోనా కేసులు 40వేల 646కు చేరుకున్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో కరోనా మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 42 మంది కొవిడ్‌తో ప్రాణాలు విడిచారు. దీంతో రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 534కి చేరింది. జిల్లా వారిగా చూస్తే.. అనంతపురంలో ఆరుగురు, చిత్తూరు, తూర్పు గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతిచెందారు. గుంటూరు, పశ్చిమ గోదావరిలో నలుగురు చొప్పున కరోనా బలయ్యారు. ఇక కడప, విశాఖ జిల్లాల్లో ముగ్గురు, కర్నూలు, నెల్లూరు, విజయనగరం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు.
రాష్ట్రంలో నిన్న గత 24 గంటల్లో 20వేల 245 శాంపిల్స్ పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 12 లక్షల 60వేల 512 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు అధికారులు.
ఒక్కరోజులోనే కరోనా నుంచి కోలుకుని 837 మంది క్షేమంగా డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 20,298 మంది వైరస్ నుంచి విముక్తి పొందారు. ప్రస్తుతం 19వేల 814 మంది చికిత్స పొందుతున్నారు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. కరోనా పరీక్షలు పెద్ద ఎత్తున చేస్తుంటే.. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.