చైనా యాప్స్ తో ఎప్పటికైనా ప్రమాదమే..!
టిక్ టాక్ సహా చైనా యాప్ లపై నిషేధం విధించాలని కొందరు సెనేటర్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ను కోరారు. ఈ విషయంలో భారత్ అసాధారణ నిర్ణయం తీసుకుందని వారు గుర్తుచేశారు. చైనా యాప్ లు అమెరికన్ల వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తున్నాయని ఆరోపించారు.
టిక్‌టాక్ సహా అనేక చైనీస్ యాప్‌లను నిషేధించాలని అమెరికన్ కాంగ్రెస్ సభ్యుల్లో కొందరు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు లేఖరాశారు. కఠిన నిర్ణయాలు తీసుకొని భారత్ చూపిన బాటలో నడవాలని సూచించారు. అమెరికన్ పౌరుల సమాచారం బయటకు పోకుండా, వారి గోప్యత, భద్రతకు భంగం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
జులై 15వ తేదీన రాసిన లేఖపై 25 మంది సెనేటర్లు సంతకాలు చేశారు. దేశ భద్రతా కోణంలో టిక్‌టాక్ సహా చైనాతో అనుబంధం ఉన్న అనేక యాప్‌లు, సామాజిక మాధ్యమ వేదికలను నిషేధించాలని కోరారు. భారత వినియోగదారులే కాకుండా అనేక దేశాల యూజర్ల సమాచారాన్ని చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థీకృతంగా దొంగిలిస్తోందని ఆరోపించారు.
అమెరికా పౌరుల స్వేచ్ఛ, భద్రత, సమాచార గోప్యతను కాపాడాలంటే చైనా యాప్ లను నమ్మకూడదన్నారు సెనేటర్లు. చైనా కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థీకృత గూఢచర్యాన్ని అడ్డుకోవాలని కోరారు. టిక్‌టాక్, హెలో సహా 59 చైనా యాప్‌లను కొద్ది రోజుల క్రితమే భారత్ నిషేధించింది.
సాధారణంగా అగ్రరాజ్యాన్ని చూసి పలు దేశాలు అనుసరిస్తుంటాయి. అలాంటిది మన దేశాన్ని చూసి అమెరికా ఫాలో కావడం విశేషం. చైనా, ఇండియా బార్డర్ లో జరిగిన గొడవలో భారతీయ సైనికులు కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే మనదేశానికి ఫుల్ సపోర్ట్ గా ఉన్న అమెరికా.. చైనా దాష్టికంపై మండిపడింది. భారత్ కు అన్ని విధాలా అండగా ఉంటామని ప్రకటించడంతో పాటు.. చైనాపై ఆగ్రహాన్ని వెళ్లగక్కింది. ఇపుడు టిక్ టాక్ పై తొలుత నిషేధం విధించిన భారత్ నే అనుసరిస్తోంది.