తిరుపతి వెంకన్న హుండీలో 20 బంగారు బిస్కట్లు.. ఒక్కొక్కటి ఎంత బరువంటే..?
తిరుపతి వెంకటేశ్వరుడిని ఆపద మొక్కల వాడు అంటారు. ఆ బిరుదును భక్తులు ఎప్పుడూ సార్థకం చేస్తూనే ఉంటారు. భారీగా తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. తాజాగా ఓ భక్తుడు ఏకంగా శ్రీవారికి 20 బంగారు బిస్కట్లు సమర్పించుకున్నాడు. ఇవి ఒక్కొక్కటి వంద గ్రాముల చొప్పున ఉన్నాయి.
అంటే మొత్తం రెండు కేజీల బంగారం సమర్పించుకున్నాడన్నమాట. హుండీ కానుకల లెక్కింపు సమయంలో ఈ విషయం వెలుగు చూసింది. ఈ కరోనా కాలంలోనూ తిరుపతి వెంకన్నకు భక్తులు తమ శక్తిమేర కానుకలు సమర్పించుకున్నారు.
జూన్ 11నుంచి జూలై 10 వరకు హుండి ఆదాయం రూ.16.73 కోట్లు వచ్చిందని టీటీడీ తెలిపింది. ఇంకా.. భక్తులు సమర్పించిన తలనీలాల విలువ పెరగడంతో రూ.7కోట్లు అదనంగా ఆదాయం వచ్చింది.
ఇక మరోశుభవార్త ఏంటంటే.. తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్తుల వివరాలను త్వరలోనే శ్వేతపత్రం ద్వారా తెలియచేస్తారు. అయితే దీనిపై అద్యయనం జరుగుతోంది. అది పూర్తి అయ్యాక శ్వేతపత్రం విడుదల చేయనున్నారు.