అన్ లాక్ 2.0 : తెలంగాణలో ప్రమాదకర స్థాయిలో వైరస్ వ్యాప్తి.... ప్రమాణాలు పాటించని ల్యాబ్ పై వేటు....?
తెలంగాణ రాష్ట్రంలో ప్రమాదకర స్థాయిలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతోంది. కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 1,892 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఈ స్థాయిలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ఒక్కరోజే రెండు వేలకు చేరువలో కేసులు నమోదు కావడంతో ప్రజల్లో భయాందోళన అంతకంతకూ పెరుగుతోంది. మొదట్లో తక్కువ సంఖ్యలో కేసులు నమోదు కాగా రానురాను కరోనా బాధితుల సంఖ్య పెరుగుతోంది.
గత మూడు రోజులుగా తెలంగాణలో ప్రతిరోజూ వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా ఆలేరు శాసన సభ్యురాలు గొంగిడి సునీతకు వైరస్ నిర్ధారణ అయింది. ఇంతకుముందు ముగ్గురు ఎమ్మెల్యేలు వైరస్ భారీన పడ్డారు. నిన్న నమోదైన కేసుల్లో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1,658 కేసులు నమోదు కావడం గమనార్హం. తెలంగాణలో ఇప్పటివరకు 1,04,118కి పెరగగా కేసుల సంఖ్య 20,462కు చేరింది.
మరోవైపు రాష్ట్రంలో వైరస్ నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. అన్ లాక్ 2.0 తర్వాత తెలంగాణలో రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతూ ఉండటం గమనార్హం. గత 24 గంటల్లో రాష్ట్రంలో ఎనిమిది మంది మృతి చెందగా మృతుల సంఖ్య 283కు పెరిగింది. నిర్ధారణ పరీక్షల్లో ప్రమాణాలు పాటించని ఒక ల్యాబ్ పై తాజాగా వేటు పడింది. ఒక ప్రైవేట్ ల్యాబ్ లో 3,726 నమూనాలు పరిశీలించగా 2,672 మందికి వైరస్ నిర్ధారణ అయింది.
వైద్య ఆరోగ్యశాఖ ఒక్క ప్రైవేట్ ల్యాబ్ లో 71.7 శాతం పాజిటివ్ కేసులు నమోదయ్యాయని.... ఇది పరీక్ష విధానంలో లోపాలను తెలియజేస్తోందని చెబుతున్నారు. ల్యాబ్ లోని సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించేంత వరకూ పరీక్షల ఫలితాలను పక్కన పెట్టినట్లు సమాచారం అందుతోంది. ప్రభుత్వం ఇకపై నిజామాబాద్, గద్వాల్, కొత్తగూడెం, కరీంనగర్, మెదక్, అసిఫాబాద్, సూర్యాపేట ఆస్పత్రుల్లో పరీక్షలు నిర్వహించనుంది.