ఇద్దరిపై వేటు.. నలుగురికి పదవులు ? మంత్రి పదవుల లెక్కేంటి ?
ఏపీ కేబినెట్ లో త్వరలో రెండు స్థానాలు ఖాళీ అవుతుండగా, పెద్ద ఎత్తున ఆశావహులు మంత్రి పదవి దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ మరికొద్ది రోజుల్లో తమ మంత్రి పదవులకు రాజీనామా చేసే అవకాశం ఉండడంతో, వారి స్థానంలో జగన్ ఎవరికీ అవకాశం కల్పిస్తారనే చర్చ జరుగుతోంది. వారిద్దరూ మంత్రి పదవులకు రాజీనామా చేయడం తప్పనిసరి కావడంతో క్యాబినెట్ లో మార్పులు చేర్పులు ఖాయంగా కనిపిస్తుంది. అదే జరిగితే ఆ ఇద్దరి స్థానంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడు రాజీనామా చేస రెండు మంత్రి పదవులకు పెద్ద పోటీనే కనిపిస్తోంది. జగన్ ఈ రెండు మంత్రి పదవులతో పాటు, ఇప్పటికే మంత్రులుగా ఉన్న మరో ఇద్దరి పనితీరుపై అసంతృప్తితో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది.
వారు పార్టీలో ఉన్నా, పార్టీకి కానీ, ప్రభుత్వానికి కానీ పెద్దగా ఉపయోగం లేకుండా పోతుందనే ఆలోచనతో ఉన్న జగన్ వారిని తప్పించి మరో ఇద్దరికి అవకాశం కల్పించాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి పదవిపై నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా చాలా ఆశలు పెట్టుకున్నారు. వైసిపికి మొదటి నుంచి ఆమె వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేసే విషయంలో రోజా దూకుడుగా వ్యవహరిస్తూ, జగన్ పై ఈగ వాలకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఆమెకు మొదటి మంత్రి వర్గ విస్తరణ లో అవకాశం వస్తుందని భావించినా, సామాజిక సమీకరణాల నేపథ్యంలో ఆ పదవి దక్కలేదు.
ఇప్పుడు రోజా తో పాటు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, గుంటూరు జిల్లాకు చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, నర్సాపురం ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు, ఉత్తరాంధ్రకు చెందిన ధర్మాన ప్రసాదరావు, అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కొలుసు పార్థసారథి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి , అంబటి రాంబాబు, అలాగే ప్రస్తుతం స్పీకర్ గా ఉన్న తమ్మినేని సీతారాం వంటి వారు మంత్రి పదవులపై ఆశలు పెట్టుకున్నారు. వీరు కాకుండా అనేక మంది మంత్రి పదవులు దక్కుతాయని ఆశలో ఉన్నారు. ప్రస్తుతం రాజీనామా తో ఖాళీ అయ్యే రెండు స్థానాలతో పాటు, మరో ఇద్దరు మంత్రులను తప్పించి మొత్తం నాలుగు స్థానాల్లో పార్టీకి ఉపయోగపడే బలమైన, నాయకులను మంత్రులుగా ఎంపిక చేయాలని జగన్ ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.