హైదరాబాద్: జగన్ అక్రమాస్తుల కేసులో మంత్రి ధర్మాన ప్రసాదరావుకు ఊరట లభించింది. నాంపల్లి కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. వాన్ పిక్ ప్రాజెక్టులో మంత్రి ధర్మాన ఓ వ్యక్తికి లాభం చేకూరే విధంగా జీవోలు జారీ చేశారంటూ సీబీఐ ధర్మానపై అభియోగాలు మోపి చార్జిషీటును దాఖలు చేసింది. సీబీఐ చార్జిషీటుతో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు ధర్మానతో పాటు 14మందికి ఈ రోజున కోర్టుకు హాజరుకావల్సిందిగా సమన్లను జారీ చేసింది. కోర్టు సమన్లను అందుకున్న ధర్మానతో పాటు చంచల్ గూడా జైలు నుంచి వైఎస్ జగన్, మోపిదేవి వెంకటరమణ, నిమ్మగడ్డ ప్రసాద్, బ్రహ్మానందరెడ్డిలను పోలీసులు కోర్టులో హాజరుపర్చారు.పలువురు ఐఏఎస్ అధికారులు కోర్టుకు హాజరయ్యారు.
ఈ కేసులో మొత్తం 14 మంది నిందితులుగా సీబీఐ నాలుగో చార్జిషీట్లో పేర్కొంది. ఇదే కేసుకు సంబంధించి మంత్రి ధర్మానను తదుపరి విచారణకై వచ్చేనెల 9 న హాజరు కావల్సిందిగా కోర్టు ఆదేశించింది. 25 వేల రూపాయల నగదు, ఇద్దరు వ్యక్తుల పూచీకత్తును ధర్మాన కోర్టుకు సమర్పించారు. దీనితో ముందస్తు బెయిల్ లభించింది. కాగా అక్రమాస్తుల కేసులో కోర్టుకు హాజరైన జగన్...ఇదే కేసులో కోర్టుకు వచ్చిన ధర్మానను పలకరించారు. ఆపై ధర్మానతో కరచాలనం చేశారు. అయితే ఇదే కేసులో కోర్టుకు హాజరైన మోపిదేవి, ధర్మాన పలకరించుకోలేదు. ధర్మానను తదుపరి విచారణ వచ్చే నెల9న రావల్సిందిగా కోర్టు ఆదేశించడంతో...ఇదే కేసులో చంచల్ గూడ జైలులో శిక్షను అనుభవిస్తున్న మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణ అనుచరులు కోర్టు దగ్గర ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకే కేసులో మంత్రి ధర్మానకు ఓ నీతి, మాజీ మంత్రి మోపిదేవికి మరో నీతి ఏమిటనీ మోపిదేవి వెంకటరణమణ అనుచరులు ప్రశ్నించారు. ఇంత వివక్షనా అంటూ ఆందోళనకు దిగారు. మరోవైపు కోర్టుకు వచ్చిన జగన్ను చూసేందుకు ఆయన అభిమానులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు కోర్టుకు తరలివచ్చారు. ధర్మానకు కోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పటికిప్పటికీ మంత్రి పదవీకి వచ్చిన ముప్పు ఏమీ లేదనీ చెప్పొచ్చు.
మరింత సమాచారం తెలుసుకోండి: