పొన్నాలపై విరుచుకుపడ్డ కేసీఆర్

Chakravarthi Kalyan
టీ పీసీసీ చీఫ్ పొన్నాలపై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ మరోసారి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌ను గెలిపిస్తే తోడేలుకు అధికారం ఇవ్వడమేనని అన్నారు. దశాబ్దాల తరబడి బానిస మనస్తత్వానికి అలవాటు పడ్డారని ఎద్దేవా చేశారు. ఆరేళ్లు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న పొన్నాల తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు అయినా పూర్తి చేశారా అని ప్రశ్నించారు. పోతిరెడ్డి ప్రాజెక్టు ద్వారా రాయలసీమకు నీటిని తరలించడానికి పొన్నాల అంగీకరించారని ఆరోపించారు. తెలంగాణలో కూడా తొంభై శాతం ఉద్యోగులు ఆంధ్రా వారే ఉంటామంటే ఎలా కుదురుతుందని ప్రశ్నించారు. ఉద్యోగులకు ఆప్షన్లు ఉండబోవన్నారు. జూన్ రెండు వరకు పంపకాలు జరగవని... తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాకే జరుగుతాయన్నారు. పోలవరం డిజైన్ మార్చాల్సిందేనని కేసీఆర్ డిమాండ్ చేశారు. ఏపీ భవన్ తెలంగాణ ప్రజల సొత్తని... దాన్ని విభజిస్తామంటే ఒప్పుకునేది లేదన్నారు. పోలవరం ప్రాజెక్ట్ ఆపడానికి కేసీఆర్ ఎవరని ప్రశ్నించిన మాజీ సీఎం కిరణ్‌కు టీఆర్‌ఎస్ అధినేత సమాధానం చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్న పార్టీ అద్యక్షుడిగా మాట్లాడుతున్నానని చెప్పారు. ఆంధ్ర అక్రమ ప్రాజెక్టులకు నీళ్లు ఇచ్చేది లేదని మరోసారి తేల్చి చెప్పారు. తెలంగాణలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గురుకుల్ ట్రస్టు భూములతో పాటు ప్రభుత్వ భూముల కేటాయింపు లాంటి అవకతవకలపై విచారణ జరిపి దోషులను జైలుకు పంపుతామని కేసీఆర్ హెచ్చరించారు. గురుకుల్ ట్రస్టు, ఐఎంజీ, ఇందు భూముల కేటాయింపులో చంద్రబాబుకు కూడా వాటా ఉందని... అది కూడా నిగ్గు తేల్చుతామని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: