ఆ విషయంలో చంద్రబాబు బాధకు అర్ధం ఉందా? జగన్ ప్లాన్ ఏంటి?
గత ఐదేళ్లు చంద్రబాబు ప్రభుత్వం అమలు చేసిన పథకాలలో చాలా పథకాలని ప్రస్తుత సీఎం జగన్ ఆపేసిన విషయం తెలిసిందే. రైతు రుణమాఫీ, అన్నా క్యాంటీన్లు ఇలా చాలానే పథకాలు జగన్ ఆపేశారు. అయితే వీటిపై చంద్రబాబు పలు పోరాటాలు కూడా చేశారు. తమ హయాంలో ఉన్న పథకాలని కొనసాగించాలని డిమాండ్ చేశారు. కానీ జగన్ అవేమీ పట్టించుకోకుండా ప్రజలకు లబ్ది కలిగేలా కొత్త పథకాలు అందించారు.
అయితే తాజాగా కూడా చంద్రబాబు గతంలో వారి హయాంలో నిర్మించిన ఇళ్లని ఇంకా ప్రజలకు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని బాధపడుతున్నారు. టీడీపీ హయాంలో కట్టిన ఇళ్లను క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారని, పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో భూసేకరణను కుంభకోణంగా మార్చారని, ఇళ్ల స్థలాల పేరుతో ప్రతి నియోజకవర్గంలో దోపిడీ చేస్తున్నారని ఆరోపించారు.
ఇక తమ హయాంలో నిరుపేదలకు 29.52 లక్షల ఇళ్లను మంజూరు చేశామని తెలిపారు. 9.10 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, 8లక్షల మంది గృహ ప్రవేశం చేశారని, అసలు సామూహిక గృహ ప్రవేశాలను దేశానికి మోడల్‌గా మార్చామని చంద్రబాబు చెప్పారు. వాస్తవానికి టీడీపీ హయాంలో పేదలకు అపార్ట్‌మెంట్స్ కట్టించారు. అయితే వాటిల్లో కొన్ని నిర్మాణాలు కూడా పూర్తి కాగా, మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి.
కానీ జగన్ వచ్చాక వాటిని ఆపేశారు. ఇక నిర్మాణం పూర్తి అయిన వాటిని క్వారంటైన్ సెంటర్లుగా మార్చి ఉపయోగిస్తున్నారు. ఇదే విషయాన్ని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారు. తమ హయాంలో కట్టించిన ఇళ్లని వెంటనే పేదలకు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అవి క్వారంటైన్ సెంటర్లుగా బాగానే ఉపయోగపడుతున్నాయి. ఇక ఈ కరోనా ప్రభావం తగ్గాక, జగన్ వాటిని పేదలకు ఇచ్చే అవకాశముందని తెలుస్తోంది. ఎలాగో జూలై 8న ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తున్నారు. తర్వాత ఇళ్ళు కట్టే కార్యక్రమం మొదలవుతుంది. అప్పుడు ఏమన్నా ఈ ఇళ్లని కూడా పేదలకు ఇవ్వొచ్చని తెలుస్తోంది.