కరోనా ముప్పుతిప్పలు పెడుతుంటే... ఇది చాలదన్నట్టు.. !
తెలంగాణలో ఇప్పటికే పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికి వాతావరణ పరిస్థితుల్లో వచ్చే సీజనల్ వ్యాధులు తోడయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలోనే సీజనల్ వ్యాధులు, కరోనా కలిసి పోయే ప్రమాదం లేక పోలేదు.
తెలంగాణలో కరోనా మహమ్మారి రోజురోజుకు విజృంభిస్తోంది. అయితే ఇప్పటికే వానాకాలం వచ్చేసింది. తొలకరి వానలు పడుతున్నాయి. దీంతో సీజనల్ వ్యాధులు మొదలవడం సహజమే. కరోనాకు సీజనల్ వ్యాధులు తోడైతే పరిస్థితి ప్రమాదకరంగా మారుతుంది. అందువల్ల ప్రతి ఒక్కరూ ఎంతో జాగ్రత్తగా, బాధ్యతగా ఉండాలంటున్నారు వైద్యులు.
కరోనా లక్షణాలు, సీజనల్ జ్వరాల లక్షణాలు దాదాపుగా ఒకేలా ఉంటాయి. దీంతో ఏది కరోనానో, ఏది సీజనల్ వ్యాధో గుర్తించడం వైద్యులకు సవాలుగా మారే అవకాశముంది. వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం, వైరల్ ఫీవర్స్‌తో పాటు డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు ప్రబలడం సహజం. కానీ కరోనా చాపకింద నీరులా ప్రబలుతుండగానే వానకాలం వచ్చింది. దీంతో కరోనా, సీజనల్ వ్యాధులు కలిసిపోయే ప్రమాదం లేక పోలేదు.
ఒకే వ్యక్తికి డెంగ్యూ, మలేరియా, స్తెన్ ఫ్లూ వంటి సీజనల్ వ్యాధులతోపాటు కరోనా కూడా సోకితే పరిస్థితి ఏమిటన్న ప్రశ్న వైద్యులను ఆందోళనకు గురిచేస్తున్నది. జ్వరం వచ్చిన ప్రతిఒక్కరికీ కరోనా పరీక్షలు చేయడం సాధ్యం కాదు. ప్రస్తుతం కంటైన్‌మెంట్ జోన్లలో ఎవరికైన జ్వరం లక్షణాలుంటేనే కరోనా పరీక్షలు చేస్తున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో నే వర్షాలు మొదలవుతుండడం వల్ల అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్‌ఫెక్షన్స్‌తోపాటు ఇతర జ్వరాలు వచ్చే ప్రమాదముంది. గాలి ద్వారా హానికర మైక్రో ఆర్గానిజమ్స్ వ్యాప్తిచెంది రకరకాల వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉంటుంది. అందువల్ల ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.
కరోనా ఇప్పటికే ప్రజలను ముప్పుతిప్పలు పెడుతోంది. ఎంతో మంది హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. కొందరు ప్రాణాలు సైతం కోల్పోతున్నారు. ఇది చాలదన్నట్టు సీజనల్ వ్యాధులు సైతం ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి.