కరోనాకు ఆ వ్యాక్సిన్ వినియోగించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్... అత్యవసర పరిస్థితుల్లో 5 డోసులు...?
దేశంలో కరోనా వైరస్ చాప కింద నీరులా శరవేగంగా విజృంభిస్తోంది. దేశంలో కరోనా బాధితుల సంఖ్య, మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. కరోనాకు వ్యాక్సిన్ అందుబాటులో లేకపోవడంతో వైరస్ ను నియంత్రించడం సవాలుగా మారింది. చైనా, ఇటలీ దేశాలు ఇప్పటికే వ్యాక్సిన్ ను కనిపెట్టినా మరికొన్ని ప్రయోగాలు చేయాల్సి ఉంది. దీంతో కరోనా విషయంలో మెరుగైన ఫలితాలను చూపిస్తున్న రెమ్‌డిసివిర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్ కనిపెట్టడం కోసం పరిశోధనలు కొనసాగుతున్నాయి. అయితే భారత ప్రభుత్వం కరోనా రోగులకు అత్యవసర పరిస్థితిలో రెమ్‌డిసివిర్ ఔషధాన్ని వాడేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. యాంటీ వైరల్ ఔషధం రెమ్‌డిసివిర్ పని చేస్తుందని తేలడంతో ఈ మందుకు అనుమతులు ఇచ్చామని కేంద్రం చెబుతోంది. అత్యవసర పరిస్థితుల్లో కేవలం ఐదు డోసులను మాత్రమే రోగులకు అందించాలనే నిబంధనలతో కేంద్రం ఈ మెడిసిన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఓ ప్రకటనలో జూన్ 1వ తేదీ నుంచి అత్యవసర పరిస్థితుల్లో రెమ్‌డిసివిర్ ఇచ్చేందుకు అనుమతులు ఇచ్చామని.... కరోనా వైరస్ సోకిన వారిపై రెమ్‌డిసివిర్ ను ప్రయోగించగా మంచి ఫలితాలు వచ్చాయని తెలిపింది. అమెరికాకు చెందిన ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్టేషన్ గత నెలలోనే ఈ మెడిసిన్ కు ఆమోదం తెలిపింది. మరోవైపు దేశంలో కరోనా వైరస్ శరవేగంగా విజృంభిస్తోంది.
భారత్ లో వైరస్ ఉగ్ర రూపం దాలుస్తోంది. గత నాలుగు రోజులుగా దేశంలో ప్రతిరోజూ 8000కు పై కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 8909 కరోనా కేసులు నమోదు కావడంతో కరోనా బాధితుల సంఖ్య 2,07,615కు చేరింది. గడచిన 24 గంటల్లో 217 మంది కరోనా వైరస్ భారీన పడి మృతి చెందారు. దేశంలో ఇప్పటివరకు 5,815 మంది కరోనా భారీన పడి మృతి చెందినట్టు తెలుస్తోంది. కరోన మరణాల్లో భారత్ 13వ స్థానంలో ఉండటం గమనార్హం.