మన దేశం పేరు మారబోతోందా?
మన దేశం పేరు మారబోతోందా? ఇండియా అని పిలవడం బానిసత్వానికి ప్రతీకగా భావించాలా? భారత్ లేదా హిందుస్థాన్‌గా పేరు మార్చాలంటున్న పిటిషన్ సుప్రీం కోర్టు చెప్పబోతుందనే ఉత్కంఠ అందరిలో నెలకొంది.
మన దేశం పేరు ఏమిటి అంటే ఇండియా అని ఠక్కున చెబుతాం. అయితే... ఇది బ్రిటీష్ పాలకులు పెట్టిన పేరని... భారత్ లేదా హిందుస్థాన్ అని చెప్పుకోవడం మన జాతీయ భావాన్ని ఇనుమడింపజేస్తుందనే వాదన చాలా కాలంగా ఉంది. ఇదే అంశంపై ఇప్పుడు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై చీఫ్ జస్టిస్ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసం విచారించనుంది.
మన రాజ్యాంగంలోని ఆర్టికల్ ఒకటిలో దేశం పేరు ఇండియాగా ఉంది. దీనిని భారత్ లేదా హిందుస్థాన్‌గా మార్చేలా కేంద్ర ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటున్నారు ఢిల్లీకి చెందిన పిటిషనర్. ఇటువంటి మార్పు దాస్యశృంకాల నుంచి బయటపడ్డామనే భావన దేశ ప్రజలకు కలిగిస్తుందంటున్నారు. దేశం పేరు మార్పు మన జాతీయ భావాన్ని మరింత ఇనుమడింపజేస్తుందన్నది పిటిషనర్ అభిప్రాయం.
1948లో మన రాజ్యంగ ముసాయిదాపై కాన్‌స్టిట్యుయంట్ అసెంబ్లీ చర్చించింది. ఆర్టికల్ ఒకటిలో దేశం పేరును భారత్ లేదా హిందుస్థాన్‌గా పేర్కొనాలనే డిమాండ్ వినిపించిందని గుర్తు చేస్తున్నారు పిటిషనర్. ఇప్పటికే దేశంలోని పలు నగరాలు తమ పాత పేర్లకు మారాయి. దేశం పేరును కూడా భారత్‌గా మార్చాల్సిన అవసరం ఉందన్నది పిటిషనర్ వాదన.
.
మన దేశం పేరును మార్చాలన్న పిటిషన్‌పై శుక్రవారమే విచారణ జరగాల్సి ఉంది. అయితే సీజేఐ బాబ్డే అందుబాటులో లేకపోవడంతో దానిని జూన్ 2కు లిస్ట్ చేసింది సుప్రీం కోర్టు. మొత్తానికి మన దేశం పేరు మార్పుపై అందరిలో ఒకింత ఆసక్తి నెలకొంది. నిజంగా పేరు మారుస్తారా అని ప్రజలందరూ చర్చించుకుంటున్నారు. పేరు మార్పుపై రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. చూద్దాం... ముందు ముందు ఏం జరుగుతుందో.. !