పోలవరం వార్: అబద్దాలు ఎవరివి? హద్దులు దాటేస్తున్నారా?

M N Amaleswara rao

పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విషయంలో ప్రస్తుత భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి దేవినేని ఉమాల మధ్య మాటల యుద్ధం తీవ్రంగా జరుగుతున్న విషయం తెలిసిందే. పోలవరం తాము 70 శాతం నిర్మాణం చేస్తే, ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం ఒక తట్ట మట్టి కూడా వేయలేదని ఉమా విమర్శిస్తున్నారు.

 

అసలు టీడీపీ ప్రభుత్వ హయాంలో 70 శాతం అవ్వలేదని, ఒకవేళ అయ్యిందని నిరూపిస్తే మీసం తీసేస్తా అని, లేదంటే ఉమా మీసం తీసేస్తారా అంటూ అనిల్ సవాల్ విసిరారు. ఇక దీనికి కౌంటర్‌గా ఉమా మాట్లాడుతూ...గతంలోనే 70 శాతం వరకు నిర్మాణం అయిందని జగన్ ప్రభుత్వం నివేదిక ఉందని, ఇప్పుడు మీసాలు ఎవరు తీసుకుంటారు? అని ప్రశ్నించారు.

 

మళ్ళీ ఉమాకు కౌంటర్‌గా అనిల్ రంగంలోకి దిగేసి.. టీడీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టులో కేవలం ముప్పై శాతం పనులు మాత్రమే చేసిందని మంత్రి ఉద్ఘాటించారు. పోలవరంలో ఒక భాగానికి సంబంధించిన రూ.18వేల కోట్ల వర్క్‌లో 70శాతం పనులు మాత్రమే టీడీపీ చేసిందని చెప్పారు. ఇక పనిలో పనిగా ఉమాని గట్టిగా తిట్టేశారు. బుర్ర తక్కువ.. నెల తక్కువ వ్యక్తి అంటూ ఫైర్ అయ్యారు.

 

అయితే ఇరు పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం చేసుకునే కంటే పోలవరం ప్రాజెక్టు త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటే మంచిదని విశ్లేషుకులు అంటున్నారు. అసలు పోలవరం నిర్మాణ విషయంలో ఇరు పార్టీల చేసుకునే వాదనలో నిజం ఎంత ఉందో కేంద్రం చెప్పాలని కోరుతున్నారు. ఎలాగో  కేంద్రమే పోలవరం నిర్మాణానికి డబ్బులు ఇస్తుంది కాబట్టి, ఆ బాధ్యత కూడా వాళ్లే తీసుకుని నిర్మాణ పనులు ఎంతవరకు వచ్చాయో క్లారిటీ ఇవ్వాలని అంటున్నారు. లేకపోతే ఈ మాటల యుద్ధం మరింతగా హద్దులు దాటేస్తుందని, ఇప్పటికే వ్యక్తిగతంగా తిట్టుకునే వరకు వెళ్లిందని, కాబట్టి కేంద్రం కాస్త పట్టించుకుని పోలవరం విషయం తేల్చాలని కోరుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: