ఏపీలో కరోనా విలయతాండవం... కేసులు పెరగటానికి అసలు కారణం ఇదే..?
ఏపీలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో ప్రతిరోజూ 60కు పైగా కేసులు నమోదవుతున్నాయి. గుంటూరు, కృష్ణా, కర్నూలు జిల్లాలలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ఈ మూడు జిల్లాల్లోనే 65 శాతం కేసులు నమోదయ్యాయి. తెలంగాణలో తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతుండగా ఏపీలో వైరస్ వేగంగా విజృంభిస్తుండటంపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి.
ఏపీలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కరోనా కేసులు నమోదవుతున్నాయని... వైసీపీ నేతలే కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి కేసులు పెరగటానికి అసలు కారణం ఏమిటి..? అనే ప్రశ్నకు ఎక్కువ సంఖ్యలో టెస్టులు చేస్తున్నామని అందువల్లే కేసులు బయటపడుతున్నాయని అధికారంలో ఉన్న వైసీపీ చెబుతోంది. ఒక్కరోజులోనే 6,000 పరీక్షలు చేసే స్థాయికి చేరుకోవడం వల్లే కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది.
రాష్ట్రంలో ఇప్పటివరకు ప్రభుత్వం 77,000 మందికి పరీక్షలు చేసింది. ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపడుతున్నా కేసులు పెరగడానికి మరో కారణం కూడా ఉందని ప్రచారం జరుగుతోంది. ఏపీలో గ్రౌండ్ లెవెల్ లో లాక్ డౌన్ నిబంధనలు కఠినంగా అమలు కాకపోవడం వల్లే కేసుల సంఖ్య పెరిగిందని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినంగా అమలు చేయాలని సూచిస్తున్నారు.
మరోవైపు రాష్ట్రంలో కరోనా విజృంభించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. విజయనగరం మినహా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. విదేశాల నుంచి రాష్టానికి వచ్చిన వారితో పాటు ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు హాజరైన వారి వల్లే కరోనా కేసుల సంఖ్య పెరుగుతోందని సమాచారం. మరో రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.