ఏపీ మాజీ సీఎం చంద్రబాబు జగన్ పరిపాలనపై విమర్శలు కురిపిస్తున్నారు. కరోనా విషయాన్ని జగన్ సరిగ్గా హ్యాండిల్ చేయడం లేదని మండిపడుతున్నారు. అదే సమయంలో ఆయన పొరుగు రాష్ట్రం తెలంగాణను మెచ్చుకోవడం ఆసక్తి రేపుతోంది. ఈ మేరకు ఆయన సీఎం జగన్ కు ఓ బహిరంగ లేఖ రాశారు. అందులో ఆయన ప్రస్తావించిన కొన్ని అంశాలు తెలంగాణ సర్కారును మెచ్చుకుంటున్నట్టే ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ లో పండించిన పంటలు పొలంలో, రోడ్డుమీద వదిలేస్తున్నారని చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు. లాక్ డౌన్ సమయంలో సరైన రవాణా సదుపాయాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల ఇలా జరిగిందంటున్నారు. పంట ఉత్పత్తులను ప్రభుత్వమే కొనుగోలు చేసి.. వారిని ఆదుకోవాలని అనేక లేఖలు రాసినా ప్రభుత్వంలో స్పందన లేదని చంద్రబాబు తన లేఖలో ప్రస్తావించారు.
ఇదే సమయంలో పొరుగు రాష్ట్రం తెలంగాణ బాగా పని చేస్తోందని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. తెలంగాణలో కొన్న ధాన్యంలో పదో వంతు కూడా ఆంధ్ర ప్రదేశ్ లో కొనలేదని చంద్రబాబు విమర్శించారు. పంట ఉత్పత్తులు ముందే సేకరిస్తే ఇప్పుడీ అకాల వర్షాలు, తుపాన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేది కాదని చంద్రబాబు విమర్శించారు. లాక్ డౌన్ కారణంగా వలస కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉందని.. స్వస్థలాలకు వెళ్లేందుకు కాలినడకన వేల కిలోమీటర్లు నడిచి వెళ్లడం మనసును కలచివేస్తోందని ప్రతిపక్షనేత చంద్రబాబు తన లేఖలో పేర్కొన్నారు.
కరోనా కారణంగా భవన నిర్మాణ కార్మికులు, చేతివృత్తులవారు, ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీద జగన్ కంటే కేసీఆర్ పాలన బావుందని చంద్రబాబు చెప్పదలిచారా అన్న వాదన ఈ లేఖ ద్వారా వెల్లడవుతోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: