ఆరెంజ్ జోన్.. గ్రీన్ జోన్ ఎలా అయిందో తెలుసా.. ?

NAGARJUNA NAKKA

ఖమ్మం...తెలంగాణ రాష్ట్రంలో చివరి జిల్లా...చుట్టూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన జిల్లాలే ఉన్నాయి. పొరుగు రాష్ట్ర జిల్లాల్లోని కరోనా పాజిటివ్ కేసులు తెగ భయపెడుతున్నాయి. ఖమ్మం జిల్లాలో మాత్రం పాజిటివ్ కేసులు నమోదు కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు అధికారులు. జిల్లాను ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్‌జోన్‌గా మార్చేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు...ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్‌గా మారటానికి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఉన్న ప్రత్యేకతలేంటి? 

 

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కరోనాను నియంత్రించేందుకు అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. జిల్లాలో వైరస్‌ విస్తృతి పెరగకుండా తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. పాజిటివ్ కేసుల నమోదు క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సరిహద్దులుగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొన్ని జిల్లాలు ఉన్నాయి. పొరుగు రాష్ట్రంలోని జిల్లాల్లో కరోనా కేసుల సంఖ్య మాత్రం రోజురోజుకు పెరుగుతూనే ఉన్నాయి. ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కేసుల సంఖ్య ఇక్కడ పెరగకపోవడం పట్ల అధికారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా చుట్టూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు ఉన్నాయి. ఈ జిల్లాలతో భద్రాచలం, అశ్వారావు పేట, సత్తుపల్లి, మధిర నియోజకవర్గాలకు సరిహద్దు ఉంది. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి.

 

ఇక...తెలంగాణలోని ఉమ్మడి వరంగల్, సూర్యాపేట జిల్లాల్లో భారీ ఎత్తున కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ జిల్లాల్లో నమోదవుతున్న కేసుల వల్ల కూడా ఖమ్మం జిల్లా వాసుల్లో ఆందోళన నెలకొంది. భద్రాచలం, పినపాక, ఇల్లెందు, కొత్తగూడెం, పాలేరు ఖమ్మం జిల్లాలకు వరంగల్, సూర్యాపేట జిల్లాలు సరిహద్దులుగా ఉన్నాయి. ప్రధానంగా సూర్యాపేట జిల్లా నుంచి ఎక్కువ మంది ఖమ్మం జిల్లాకు వైద్యం కోసం వస్తుంటారు. ఇలాంటి తరుణంలో జిల్లా యంత్రాంగంలో ఆందోళన నెలకొంది. అయితే జాగ్రత్తగా ఉంటే కరోనా పాజిటివ్ కేసుల తీవ్రతను బట్టి ఆరెంజ్‌ జోన్‌లో ఉన్న ఖమ్మం జిల్లా గ్రీన్‌జోన్‌కు వెళ్లవచ్చని ఇక్కడి అధికారులు..ప్రజాప్రతినిధులు అంచనా వేస్తున్నారు. 

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విదేశాల నుంచి వచ్చిన ఇద్దరికి కరోనా పాజిటివ్ వచ్చింది. అందులో ఒక్కరి వల్ల మరో రెండు కాంటాక్ట్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొదట అధికార యంత్రాంగంలో ఆందోళన చెలరేగింది. బాధితుల్లో ముగ్గురు ఇప్పుడు డిస్ చార్జి అయ్యారు. ఇక...అప్పటి నుంచి ఇప్పటి వరకు మళ్లీ ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. దీనిపై కేంద్ర ప్రభుత్వం భద్రాద్రి జిల్లా అధికార యంత్రాంగాన్ని అభినందించింది. ఇప్పుడు ఈ జిల్లా గ్రీన్‌జోన్‌లోకి వెళ్లే అవకాశం రానుంది.

 

ఖమ్మం జిల్లాలో ఆలస్యంగా ఏడు కేసులు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యాయి. అందులో మర్కజ్ వల్ల రెండు కాంటాక్ట్ కేసులు బయటపడ్డాయి. ఒకే కుటుంబంలో అయిదు కేసులు నమోదయ్యాయి. ఈ అయిదు కేసులు మాత్రమే ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్నాయి. పాజిటివ్‌ కేసులు ఇంకా పెరగకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. రానున్న కాలంలో ఖమ్మం జిల్లాను గ్రీన్ జోన్‌గా చేయడానికి ప్రయత్నాలు అధికారులు చేస్తున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: