ప్రధాని మోదీ మే 3వ తారీఖునే ఎందుకు ఎంచుకున్నారంటే...?

Reddy P Rajasekhar

దేశంలో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూ ఉండటంతో ప్రతిరోజూ వందల సంఖ్యలో దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదవుతున్నాయి. కేంద్రం కరోనా కట్టడి చర్యల్లో భాగంగా తొలుత ఏప్రిల్ 14 వరకు లాక్ డౌన్ ప్రకటించింది. కానీ కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సక్సెస్ కాలేకపోయింది. ఇతర దేశాలతో పోలిస్తే మన దేశంలో కేసుల సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ ప్రతిరోజూ కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. 
 
ప్రధాని మోదీ ప్రజలు, రాజకీయ విశ్లేషకులు ఊహించిన విధంగానే లాక్ డౌన్ ను పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. ప్రజలంతా ఏప్రిల్ 30 వరకు మోదీ లాక్ డౌన్ ను పొడిగిస్తారని భావిస్తే మోదీ మాత్రం మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించనున్నట్లు ప్రకటన చేశారు. అయితే ప్రధాని మోదీ మే మూడో తేదీనే ఎంచుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. 
 
మే 1వ తేదీన కార్మిక దినోత్సవం సందర్భంగా పబ్లిక్ హాలిడే.... మే 2, 3 వారాంతపు సెలవులు కావడంతో మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ కారణాలను దృష్టిలో ఉంచుకునే మోదీ లాక్ డౌన్ ను మే 3వ తేదీ వరకు పొడిగించారని ఢిల్లీ ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. పలు రాష్ట్రాలు లాక్ డౌన్ ను పొడిగించాలని సూచనలు చేయగా మోదీ వారి డిమాండ్ ను పరిగణనలోకి తీసుకొని లాక్ డౌన్ పొడిగిస్తున్నట్లు ప్రకటన చేశారు. 
 
మరోవైపు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ పొడిగించిన నేపథ్యంలో మే 3వ తేదీ వరకు రైళ్లు, విమానాలు రద్దు కానున్నాయి. ఇప్పటికే రైల్వే శాఖ మే 3 వరకు ప్యాసింజర్ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటన చేయగా డీజీసీఏ దేశీయ, విదేశీయ విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు ప్రకటన చేసింది. టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులకు డబ్బులు రీఫండ్ కానున్నాయి. కేంద్రం ఈ నెల 20 తర్వాత పరిస్థితులను బట్టి ఆంక్షలను సడలించే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: