కరోనా ఎఫెక్ట్ : కష్టాల సుడిగుండంలో మత్స్యకారులు !
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా బడుగుల బతుకులను కష్టాల్లోకి నెడుతోంది. లక్షలాది మంది జీవన ప్రమాణాలను పూర్తిగా దెబ్బతీస్తోంది. ఉపాధికి దూరం చేస్తోంది. ముఖ్యంగా సముద్రంలో చేపల వేటపై ఆధారపడిన మత్స్యకారుల పొట్టకొడుతోంది. 20 రోజులుగా వేటకు దూరమై నానా ఇబ్బందులు పడుతున్నారు.
రాత్రీ లేదు పగలు లేదు. ఎండా వానా తేడా లేదు. కడలి లోతుల్లో బతుకును వెతుక్కోవటం మాత్రమే వారికి తెలుసు. అందుకే ఎంత కష్టం వచ్చినా సంద్రాన్ని వదలరు. తీరానికి దూరం కారు. అలాంటి కడలి తల్లి బిడ్డల బ్రతకులను కరోనా కాటేసింది. నిత్యం అనేక సమస్యలతో బతుకునే ఈదే మత్స్యకారులను.. కరోనా వైరస్ సుడిగుండాల్లోకి నెట్టేసింది. కరోనా లాక్ డౌన్ తో మత్స్యకారులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు.
విజయనగరం జిల్లాలో బోగాపురం, పూసపాటిరేగ మండలాల్లో 29 కిలోమీటర్ల పరిధిలో సముద్ర తీరం ఉంది. దాదాపు 27 వేల మంది మత్య కారులు .. ఈ రెండు మండలాల్లో జీవనం సాగిస్తూ ఉన్నారు వీరిలో అనేక మందికి చేపల వేటే ఆధారం. జిల్లాలోని 35 మత్స్యకార గ్రామాల్లో సుమారు 590 మోటారు బోట్లలో వేట సాగిస్తూ ఉంటారు. కానీ, కరోనా లాక్ డౌన్ కారణంగా వేటనిషేదించడంతో మత్య్సకారులంతా ఆర్దికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో గత నెల 18 నుంచి మత్స్యకారులు చేపలవేటకు వెళ్లడం లేదు. దీంతో ఆర్థిక ఇబ్బందులు పడుతూ కాలం వెల్లదీస్తున్నారు. దీనికి తోడు వేట విరామ సమయం కూడా సమీపిస్తుండడంతో ఆందోళన చెందుతున్నారు గంగపుత్రులు . కొద్ది రోజుల క్రితం వరకూ చేపల వేటతో కళకళలాడిన తీర ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతుంది.
ఓ వైపు కరోనా లాక్ డౌన్ కోనసాగుతుండగానే ..మరో వైపు ఈనెల 15 నుంచి జూన్ 15 వరకు రెండు నెలల పాటు ప్రభుత్వం వేట నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సీజన్ లో చేపల పునరుత్పత్తి జరుగుతుంది. దీంతో ప్రభుత్వం ప్రతి ఏడాది రెండు నెలలపాటు వేట నిషేధిస్తూ ఉంటుంది. ఈ నిషేధం వల్ల చేపల సంతతి పెరిగి మత్స్యకారులకు తర్వాత రోజుల్లో కలిసివస్తుందని ప్రభుత్వ భావిస్తుంది. వేట నిషేధం మంచి విషయమే అయినా ఇప్పటికే దాదాపు నెల రోజుల నుంచి ఉపాధి లేని మత్స్యకారులు నిషేధం కాలంలో కూడా ప్రత్యామ్నాయం లేని పరిస్థితిలో పడుతున్నారు.