అందుకే హాట్ స్పాట్ లు.. లాక్ డౌన్ ఒక్కటే సరిపోదు.. !

NAGARJUNA NAKKA

కరోనా వైరస్‌ ని లాక్‌డౌన్‌ చాలా వరకు కంట్రోల్‌ చేస్తుంది. కానీ, లాక్‌డౌన్‌ మాత్రమే పూర్తి పరిష్కారం కాదు. ఎందుకంటే, లాక్‌ డౌన్‌ సమయంలో కూడా కూరగాయల కోసమో, కిరాణా సరుకుల కోసమో బయటకు వెళ్లినపుడు వైరస్‌ సోకే ప్రమాదం పొంచి ఉంటుంది. అలాంటపుడు వైరస్‌ ఉన్న ప్రాంతాలను గుర్తించి మరిన్న కఠిన చర్యలు తీసుకోవటమే దీనికి పరిష్కారం. లేదంటే లాక్‌ డౌన్‌ నడుస్తున్న చాపకింద నీరులా కరోనా వ్యాపిస్తూనే ఉంటుంది. అందుకే తెలంగాణలో హాట్ స్పాట్‌ లు ఏర్పాటు చేశారు. 

 

హాట్ స్పాట్ పదాన్ని ఇంటర్నెట్  వాడకంలో ఉపయోగిస్తారు. ఇప్పుడు కరోనా కాలంలో మరింతగా పాపులర్ అయింది. ఒక ఇంటర్నెట్ కనెక్షన్ ని హాట్ స్పాట్ తో ఇద్దరు ముగ్గురు వాడుకునే వీలుంటుంది.  అదే విధంగా హాట్ స్పాట్ ఏరియాలో కూడా కరోనా కేసులు తేలిగ్గా వ్యాపించే ప్రమాదం ఉంటుంది. ఈ ప్రాంతాల నుంచి బయటి ప్రాంతాలకు కూడా కరోనా వైరస్ వ్యాప్తి అధికంగా ఉంటుంది. ఒకరి నుంచి మరొకరికి ఈ వైరస్ ఎక్కువగా వ్యాపిస్తుంటుంది.  ఈ చైన్ ను బ్రేక్ చేయాలి అంటే సోషల్ డిస్టన్సింగ్‌ తో పాటుగా ఇంటి నుంచి ఒక్కరు కూడా బయటకు రాకుండా ఉండటం ఒక్కటే సేఫ్ అని చెప్పాలి.  

 

ఒకే ప్రాంతంలో అత్యధికంగా కరోనా వైరస్ కేసులు నమోదవుతుంటే దానిని క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తారు. తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉన్నాయి. ఒక ప్రాంతంలో 5-6 కేసులు నమోదైతే దాన్ని హాట్‌ స్పాట్‌ గా వైద్య ఆరోగ్య శాఖ గుర్తిసోంది. కొన్నిచోట్ల రెండు మూడు కేసులు నమోదైనా హాట్‌ స్పాట్‌ గా గుర్తించింది. వైరస్ తీవ్రతను బట్టి  క్లస్టర్‌ కంటెయిన్‌ మెంట్‌ జోన్లు గుర్తిస్తున్నారు. 

 

హాట్‌ స్పాట్‌ లు గా గుర్తించిన ఏరియాలను పూర్తిగా దిగ్బంధం చేసి అక్కడి నుంచి ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా చూస్తారు.  ఇలా చేయడం వలన స్థానికంగా కొత్తగా ఏవైనా కేసులు ఉంటే బయటపడతాయి.  కరోనా సోకినా వ్యక్తులను అక్కడి వరకే రిస్ట్రిక్ట్ చేసి హాస్పటల్ కు తరలించే అవకాశం ఉంటుంది.  ఒకరి నుంచి మరొకరికి సోకకుండా ఉండేందుకు ఇప్పుడు ఈ క్లస్టర్ కంటైన్మెంట్ జోన్ లను అష్టదిగ్బంధం చేస్తున్నారు.  

 

తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు ర్యాపిడ్ గా పెరగటంతో  వైరస్ వ్యాప్తిని  కంట్రోల్ చేయటానికి  డేంజర్ లో ఉన్న ప్రాంతాల్లో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణలో శుక్రవారం వరకు 130 ఉన్న కంటైన్మెంట్ జోన్లను శనివారం నాటికి ఏకంగా 243కు పెంచారు. కేసుల సంఖ్య పెరగడం, ఒకట్రెండు కేసులు నమోదైన చోట్ల కూడా పరిస్థితి తీవ్రంగా ఉండటంతో హాట్ స్పాట్ ల సంఖ్యను పెంచారు. ఆయా ఏరియాలను ప్రభుత్వం అష్టదిగ్బంధం చేసింది. ఎవరూ బయటకు పోకుండా ఏర్పాట్లు చేసింది. 

 

ఒక్క జీహెచ్ఎంసీ పరిధిలోనే ఏకంగా 123 కంటైన్మెంట్ జోన్లు ప్రకటించారు. ఒకట్రెండు కేసులు నమోదైన ప్రాంతాలను కూడా కంటైన్మెంట్లుగా ప్రకటిస్తున్నారు. ఉదాహరణకు ఏదైనా ఒక జిల్లాలోని ఒక గ్రామంలో ఒక కేసు నమోదైతే, దాన్ని ఒక కంటైన్మెంట్ జోన్‌ గా ప్రకటించి అష్టదిగ్బంధం చేస్తున్నారు. వాస్తవంగా నిబంధనల ప్రకారం కేసులు నమోదైన ప్రాంతానికి రెండు, మూడు కిలోమీటర్ల వరకు కంటైన్మెంట్లు ఉండాలి. కానీ ఇప్పుడు కిలోమీటర్ల లెక్కన కాకుండా కేసున్న ప్రతి చోటును జోన్లుగా చేశారు. కొన్ని కంటైన్మెంట్ జోన్లలో 10 ఇళ్లున్నా వాటిని ప్రత్యేకంగా దిగ్బంధం చేస్తున్నారు. అందుకే ఒకేసారి దాదాపు రెండింతలు జోన్లు నమోదైనట్లు తెలుస్తోంది.

 

తెలంగాణ వ్యాప్తంగా ప్రకటించిన కంటైన్మెంట్ క్లస్టర్ ఏరియాల్లో బారికేడ్లు కట్టి ఆ ప్రాంతాల ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసేందుకు వాలంటీర్లను ఏర్పాటు చేశారు. అయితే కంటెయిన్‌ మెంట్‌ జోన్ల ఏర్పాటును చూసి కంగారు పడొద్దని తెలంగాణ సర్కారు ప్రజలకు సూచించింది. ఈ ప్రాంతాలు వైరస్ వ్యాప్తిని నియంత్రించటానికే ఏర్పాటు చేశామని చెప్తోంది. 

 

హైదరాబాద్ నగరంలో జీహెచ్ఎంసీ, ఆరోగ్యశాఖ కలిసి సమన్వయంతో పనిచేస్తున్నాయి. ఈ ప్రాంతాల్లో ప్రజలకు నిత్యావసరాలు ఇంటికే అందించటంతో పాటు, వైద్య శాఖ ప్రత్యేక అంబులెన్స్‌ లను కూడా ఏర్పాటు చేసింది.ఈ ప్రాంతాల్లో ప్రతి ఇంటిని రోజుకు రెండు సార్లు సర్వే చేయాలని ప్రభుత్వం సిబ్బందిని ఆదేశించింది. రెగ్యులర్గా శానిటైజ్ చేయటంతో పాటు, నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు అమలవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: