మాస్క్ లేకుండా రోడ్డు మీదకొస్తే.. !

NAGARJUNA NAKKA

కరోనా విజృంభిస్తున్న వేళ మాస్కులు తప్పనిసరి చేస్తున్నాయి పలు రాష్ట్రాలు. మాస్కులు ధరించకుండా రోడ్ల మీదకి వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరిస్తున్నాయి. ఢిల్లీ, ముంబయి, యూపీలతో పాటు జమ్ము కశ్మీర్ లో కూడా మాస్క్ ల వాడకంపై అదేశాలు జారీ అయ్యాయి. అటు తెలంగాణ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించింది. 

 

దేశంలో కరోనా కేసులు, మరణాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. లాక్‌ డౌన్‌ అమల్లో ఉన్నప్పటికీ కేసుల సంఖ్య పెరుగుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో  మాస్క్ లు ధరించడం తప్పనిసరి చేస్తూ పలు  రాష్ట్ర ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేశాయి. కరోనా విస్తరణ ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వాలు ఆంక్షలు కఠినతరం చేశాయి. ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం బయటకు వచ్చినప్పుడు తప్పనిసరిగా మాస్క్లు ధరించాల్సిందేనని ఆర్డర్స్ విధించారు. ఎవరైన మాస్కులు లేకుండా బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకోనున్నారు. 

 

కరోనా వైరస్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్న వేళ మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేస్తూ.. ముంబై నగర పాలక సంస్థ నిర్ణయం తీసుకుంది. ఇళ్ల నుంచి బయటకు వచ్చే ప్రజలు కచ్చితంగా ముఖానికి మాస్క్ ధరించాల్సిందేనని ముంబై నగర పాలక సంస్థ సూచించింది. మాస్కులు లేకుండా బయటకు వస్తే శిక్ష తప్పదని హెచ్చరించింది. ఎపిడమిక్ డిసీజెస్ యాక్ట్ 1897 ప్రకారం బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య 5000 దాటగా.. ఒక్క మహారాష్ట్రలోనే కోవిడ్ కేసుల సంఖ్య 1300 కు చేరాయి.

 

మహారాష్ట్రలో కరోనా కేసులు దేశంలోనే అత్యధికంగా నమోదయ్యాయి. ఆసియాలోనే అత్యంత మురికివాడగా పేరున్న ధారావిలోనూ కరోనా కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ థాక్రే కఠిన నిర్ణయాలు ప్రకటించారు.

 

ఢిల్లీ ప్రభుత్వం కూడా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారు మాస్కులు ధరించడాన్ని తప్పనిసరి చేసింది. మాస్కులు ధరించడం వల్ల కరోనా వ్యాపించే ముప్పు తగ్గుతుందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మాస్కులు అందుబాటులో లేకపోతే క్లాత్‌ తో తయారు చేసిన మాస్కులను కూడా ధరించొచ్చని కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో 20 హాట్ స్పాట్లను గుర్తించామని ఆయన చెప్పారు.

 

ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా మాస్కులు ధరించాలని ఉత్తర ప్రదేశ్ సర్కారు రాష్ట్ర ప్రజలకు సూచించింది. 66 కోట్ల ట్రిపుల్ లేయర్ ఖాదీ మాస్కులకు యోగి ప్రభుత్వం ఇప్పటికే ఆర్డర్ ఇచ్చింది. వీటిని ఉతికి మళ్లీ వాడుకోవచ్చు. పేదలకు ఈ మాస్కులను ఉచితంగా అందించనుండగా.. ఇతరులకు నామమాత్ర ధరకు అందించనున్నారు. 

 

అటు  జమ్మూ కశ్మీర్, లడఖ్ ప్రభుత్వాలు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేశాయి. జమ్మూకశ్మీర్ లో కూడా సెక్రటేరియట్ కి వెళ్ళే వారికి మాస్క్ లు తప్పనిసరి చేశారు.

 

ఇక రోడ్లు, సంస్థలు, ఆఫీసులు, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి ఊయటం నేరమని తెలంగాణ ప్రభుత్వం హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మటం వల్ల ఇన్ఫెక్షన్లు మరింత ప్రబలే ప్రమాదం ఉంది. ప్రజారోగ్యం భద్రత దృష్ట్యా బహిరంగ ప్రదేశాల్లో పాన్ , లేదా ఉమ్మి ఊయటం, గుట్కా నమిలి ఉమ్మటం, పొగాకు ఉత్పత్తులు నమిలి ఉమ్మటాన్ని నిషేధిస్తున్నామని ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: