కరోనాపై యుద్ధం : కేసీఆర్ కు బోస్టన్ గ్రూప్ షాక్ ?
కేంద్రం తీవ్ర గందరగోళం లో ఉంది. దేశవ్యాప్తంగా అమలు అవుతున్న లాక్ డౌన్ నిబంధన 14వ తేదీతో ముగియనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి లాక్ డౌన్ మరికొంత కాలం పొడిగించాలని విజ్ఞప్తులు అందుతున్నాయి. అయితే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోవడంతో ప్రభుత్వాలు నడిచే పరిస్థితి కనిపించడం లేదు. కేంద్రం నుంచి తాత్కాలికంగా సహాయం అందుతున్నా, ప్రజలు, ప్రభుత్వాలకు ఏర్పడుతున్న నష్టం మాత్రం కోలుకోలేని విధంగా ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం లాక్ డౌన్ నిబంధన ఏప్రిల్ 14వ తేదీతో ఎత్తి వేస్తారా లేక మరికొంత కాలం పొడిగిస్తారా అనేది అందరికీ సందేహంగా మారింది. మార్చి 25 నుంచి ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ దశలో పరిస్థితి అదుపులోకి వస్తుంది అనుకుంటున్న సమయంలో ఢిల్లీ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ద్వారా అనేక మందికి కరోనా వైరస్ సోకడం, ఇప్పటికే కొంతమంది ఆచూకీ లభించకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
దేశవ్యాప్తంగా 16 రాష్ట్రాల్లో మార్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారి ప్రభావం ఉండడంతో రోజురోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఈ దశలో తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా మరికొద్ది రోజులు లాక్ డౌన్ నిబంధన పొడిగించాలంటూ ప్రధానిని కోరినట్లు చెప్పారు అంతేకాకుండా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ కూడా ఇదే విధంగా రిపోర్ట్ ఇచ్చిందని దాని ప్రకారం ఇండియాలో జూన్ 3 వరకు లాక్ డౌన్ నిబంధన పొడిగించాలంటూ కేసీఆర్ డిమాండ్ చేశారు. అయితే దీనిపై తాజాగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ స్పందించింది.
లాక్ డౌన్ పొడిగింపు కి సంబంధించి ఎటువంటి నివేదిక ఇప్పటి వరకు ఇవ్వలేదని భారత్ తో పాటు ప్రపంచానికి సంబంధించి లాక్ డౌన్ పొడిగింపు విషయంలో ఎటువంటి నివేదిక ఇవ్వలేదని, మేము నివేదిక ఇస్తున్నట్లుగా సోషల్ మీడియాలోనూ, ఇతర సామజిక మాధ్యమాల్లోనూ వస్తున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని తెలిపింది. అయితే ఇప్పటికే మీడియాలో నిబంధనలకు సంబంధించి అనేక కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పుడు స్వయంగా బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ స్పందన తెలియజేయడంతో ఈ వ్యవహారంపై తీవ్ర స్థాయిలో చర్చ నడుస్తోంది.