ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం... పదో తరగతి పరీక్షలు ఎప్పుడంటే...?

Reddy P Rajasekhar

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రాష్ట్రంలో బాధితుల సంఖ్య 192కు చేరింది. దేశవ్యాప్తంగా ఈ నెల 14 వరకు లాక్ డౌన్ అమలులో ఉండటంతో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. ఏపీ ప్రభుత్వం పదో తరగతి పరీక్షల విషయంలో కీలక నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఏప్రిల్ నెల చివరి వారం లేదా మే నెల మొదటి వారంలో పరీక్షలు జరిగే అవకాశం ఉందని సమాచారం. 
 
ప్రభుత్వం మొదట మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు పదో తరగతి పరీక్షలు జరపనున్నట్లు షెడ్యూల్ ప్రకటించగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రకటన వెలువడడంతో పరీక్షలు వాయిదా పడ్డాయి. ప్రధాని మోదీ లాక్ డౌన్ ప్రకటించడం... రాష్ట్రంలో కరోనా కేసులు పెరగడంతో మార్చి 31 నుంచి జరగాల్సిన పరీక్షలను కూడా ప్రభుత్వం వాయిదా వేసింది. 6 - 9 తరగతుల విద్యార్థులను ఎటువంటి పరీక్షలు లేకుండానే పై తరగతులకు ప్రమోట్ చేస్తున్నట్లు ప్రభుత్వం గతంలోనే ప్రకటించింది. 
 
విద్యాశాఖ లాక్ డౌన్ అనంతరం కొత్త షెడ్యూల్ ప్రకటించినా షెడ్యూల్ కు, పరీక్షలకు కనీసం 15 రోజుల వ్యవధి అవసరమని చెబుతోంది. కరోనా నేపథ్యంలో విద్యార్థుల మధ్య దూరం ఎక్కువగా ఉండేలా కూర్చోబెడతామని బోర్డు గతంలోనే ప్రకటించింది. విద్యాశాఖ పరీక్షలు వాయిదా పడటంతో మరిన్ని పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడంతో పాటు మళ్లీ హాల్ టికెట్లను జారీ చేయాల్సి ఉంది. 
 
మరోవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కేంద్రం మరికొన్ని రోజుల్లో లాక్ డౌన్ గురించి కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. కేంద్రం లాక్ డౌన్ ను కొనసాగిస్తే మాత్రం పదో తరగతి పరీక్షలు మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తున్న నేపథ్యంలో లాక్ డౌన్ కొనసాగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మోదీ లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో తెలియాలంటే మాత్రం కొంతకాలం ఆగాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: