కేశినేని కుమార్తెకు దేవినేని అవినాష్ చెక్ పెట్టగలరా?
కరోనా వల్ల స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడిన విజయవాడలో రాజకీయాల్లో మాత్రం వేడి తగ్గడం లేదు. కీలకమైన విజయవాడ కార్పొరేషన్‌ని గెలుచుకునేందుకు వైసీపీ, టీడీపీలు వ్యూహాలు రచిస్తూనే ఉన్నాయి. ఓ వైపు వైసీపీ నుంచి వెస్ట్ ఎమ్మెల్యే, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తూర్పు ఇన్‌చార్జ్ దేవినేని అవినాష్‌లు కష్టపడుతున్నారు. అటు టీడీపీలో ఎంపీ కేశినేని నాని, తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, సెంట్రల్ మాజీ ఎమ్మెల్యే బొండా ఉమా, వెస్ట్ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, వంగవీటి రాధాలు గెలుపు కృషి చేస్తున్నారు.
అయితే టీడీపీ తరుపున కేశినేని కుమార్తె శ్వేతని మేయర్ అభ్యర్ధిగా ప్రకటించి ఉన్నారు. కానీ వైసీపీలో మాత్రం ఎవరికివారే తమకు సంబంధించిన వ్యక్తులని మేయర్‌గా ప్రకటించుకోవాలని చూస్తున్నారు. ఇక వీరి రాజకీయం పక్కనబెడితే విజయవాడలో ఓ ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. కేశినేని కుమార్తె శ్వేత, దేవినేని అవినాష్‌ల మధ్య కీలక ఫైట్ జరిగే అవకాశముందని అంటున్నారు.
ఎందుకంటే ఈ ఇద్దరు వారసత్వంగానే రాజకీయాల్లోకి వచ్చారు. ఎంపీ కేశినేని నాని వారసురాలుగా శ్వేత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. అటు దేవినేని నెహ్రూ వారసుడుగా అవినాష్ ఎప్పుడో రాజకీయాల్లోకి దిగారు. పైగా ఇద్దరు కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. అయితే విజయవాడ కార్పొరేషన్ సొంతం చేసుకోవాలంటే, తూర్పు నియోజకవర్గం కీలకం కానుంది. ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ఉన్నారు. దాంతో ఇక్కడ టీడీపీకి అనుకూలత ఎక్కువ ఉంది.
ఇక్కడ మెజారిటీ డివిజన్లు టీడీపీ కైవసం చేసుకునే అవకాశముంది. కాకపోతే వైసీపీ తరుపున తూర్పు ఇన్‌చార్జ్‌గా అవినాష్ ఉన్నారు. ఆయన కూడా తమ పార్టీ అభ్యర్ధులని గెలిపించుకునేందుకు కష్టపడుతున్నారు. తూర్పులో ఎక్కువ డివిజన్లు గెలుచుకుని మేయర్ పీఠం వైసీపీ ఖాతాలో పడేయాలని చూస్తున్నారు. ఇక ఈ విధంగా అవినాష్ చేయగలిగితే శ్వేతకు చెక్ పెట్టి, ఆమెని మేయర్ పీఠం ఎక్కకుండా అడ్డుకోవచ్చు.