దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు ఎన్నో తెలుసా..?
భారత్‌లో కరోనా వైరస్ విస్తరిస్తోంది. బాధితుల సంఖ్య 56కి చేరింది. కేరళ, కర్నాటకలో కరోనా విస్తరణ ఆందోళనకరంగా ఉంది. వైరస్ కట్టడి కోసం ఈశాన్య రాష్ట్రాల విదేశీ టూరిస్టుల రాకపై ఆంక్షలు విధించాయి. భూటాన్, మయన్మార్‌తో సరిహద్దుల్ని మూసివేశారు.
ప్రభుత్వం, అధికారులు ఎంత సమర్థవంతంగా చర్యలు తీసుకుంటున్నా.. కరోనా వైరస్ విస్తరణ ఆగడం లేదు. రోజు రోజుకీ కొత్త కేసులు నమోదవుతున్నాయి. కేరళలో మరో ఆరుగురికి కొవిడ్ 19 వైరస్ పాజిటివ్‌గా తేలింది. వీళ్లంతా ఇటలీ నుంచి కొచ్చిన్ వచ్చారు. వీరితో పాటు వీరి బంధువులకు కూడా వైరస్ సోకింది.
కేరళలోవైరస్ బారిన పడిన వారి సంఖ్య 12కు చేరింది. వైరస్ మరింత మందికి సోకకుండా ఉండేందుకు స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలు, మదర్సాలకు ఈ నెలాఖరు వరకూ సెలవులు ఇచ్చారు. ఏడో తరగతి పరీక్షల్ని వాయిదా వేశారు. కేరళలో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉండటంతో.. భక్తులెవరూ శబరిమల రావద్దని.. దేవస్వం బోర్డు విజ్ఞప్తి చేసింది.
కర్నాటకలో మరో మూడు కేసులు నమోదైనట్లు ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య నాలుగుకు చేరింది. వైరస్ సోకినవారితో పాటు వారి కుటుంబ సభ్యుల్ని ప్రత్యేక వార్డులో ఉంచారు. కొత్తగా వైరస్ సోకిన వారు ఎక్కడెక్కడ తిరిగారు.. ఎవరితో కలిశారనే దానిపై ఆరా తీసిన అధికారులు.. వారిని కూడా క్వారంటైన్ వార్డుకు తరలించారు.
కరోనా వైరస్ భయంతో రాష్ట్రాలన్నీ ముందుజాగ్రత్త చర్యలు తీసుకుంటున్నాయి. అంతర్జాతీయ సరిహద్దున్న ఈశాన్య రాష్ట్రాలు కూడా విదేశీయుల రాకపోకలపై ఆంక్షలు విధించాయి. సిక్కిం ప్రభుత్వం ఇప్పటికే చైనా, భూటాన్ సరిహద్దు వద్ద నియంత్రణలను అమలుచేస్తోంది .మయన్మార్‌తో అంతర్జాతీయ సరిహద్దును మూసివేస్తూ మణిపూర్ నిర్ణయం తీసుకుంది. ఇండో-మయన్మార్ దేశసరిహద్దులో ఉన్న అన్ని గేట్లను మూసివేస్తున్నట్లు ప్రకటించింది.
మయన్మార్‌తో పాటు బంగ్లాదేశ్‌కు రాకపోకలను పూర్తిగా నిషేధించామని మిజోరం వెల్లడించింది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా విదేశీయులకు ఇచ్చే ప్రొటెక్టెడ్ ఏరియా పర్మిట్‌ల జారీ నిలిపివేసింది. చైనా సరిహద్దు కలిగిన అరుణాచల్‌ప్రదేశ్‌లోకి విదేశీయులు రావాలంటే పీఏపీ తప్పనిసరి. జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ, పంజాబ్, యూపీలో కొత్తగా కేసులు నమోదయ్యాయి.