తెలంగాణ రైతులకు కేసీఆర్ గుడ్‌న్యూస్.. రైతులు పండగ చేస్కోండి...!
తెలంగాణ బడ్జెట్ లో కెసిఆర్ అనేక రంగాలకు వరాల జల్లు కురిపించారు. ఆదివారం తెలంగాణ ఆర్థిక మంత్రి తన్నీరు హరీష్ రావు ప్రవేశపెట్టిన బడ్జెట్లో అటు నీటిపారుదల రంగం తో పాటు సంక్షేమ రంగానికి భారీ ఎత్తున నిధులు కేటాయించారు. ఇక వ్యవసాయ రంగానికి సైతం భారీ ఎత్తున నిధులు కేటాయించిన కెసిఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతులకు అదిరిపోయే న్యూస్ అందించింది. రూ.25వేల లోపు ఉన్న రుణాలను ఈ నెలలోనే మాఫీ చేస్తామని ప్రకటించింది. కేసీఆర్ 2014లో తొలిసారి తెలంగాణ ముఖ్యమంత్రి అయనప్పుడు రాష్ట్రంలో రైతులు అందరికి రు.లక్ష చొప్పున రుణమాపీ చేసి ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు.
ఇక ఇప్పుడు కూడా తెలంగాణలో రైతులు అప్పుల బాధతో విలవిల్లాడుతున్నారు. గ్రామీణ తెలంగాణ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఈ క్రమంలోనే కేసీఆర్ ప్రభుత్వ ప్రకటన రైతులకు కొంత వరకు ఉపశమనం లాంటిదే. తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ 2020-21ను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు ఆదివారం శాసన సభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రూ. 25 వేల రూపాయల లోపు ఉన్న రుణాలు ఉన్న రైతులు...5 లక్షల 83 వేల 916 మంది ఉన్నారని తెలిపారు. వీరి రుణాలను ఒకే దఫా కింద మాఫీ చేస్తున్నట్టు ప్రకటించారు. ఇక ఈ మార్చి నెలలోనే రూ.25వేల లోపు ఉన్న రుణాలు మాఫీ చేయడానికి రూ.1,198 కోట్లు విడుదల చేస్తున్నామని.. ఇందుకు మార్గదర్శకాలు కూడా రిలీజ్ చేస్తామని ప్రకటించారు.
ఇక ఈ రు. 25 వేల మొత్తం చెక్కుల రూపంలో రైతులకు అందజేస్తామని హరీష్ ప్రకటించారు. 25 వేల నుంచి లక్ష లోపు ఉన్న రుణాలను మొత్తం రూ. 24 వేల 738 కోట్లు ఉన్నాయన్నారు. నాలుగు విడతలుగా ఎమ్మెల్యేలు చెక్కుల రూపంలో అందించడం జరుగుతుందన్నారు. ఈ ఏడాది రైతు రుణమాఫీ కోసం రూ. 6 వేల 225 కోట్లను ప్రతిపాదించామన్నారు. ఏదేమైనా కేసీఆర్ ప్రభుత్వ ప్రకటన వల్ల రైతులకు ఎంతైనా మేలు జరుగుతుంది. దీంతో రైతులంతా బడ్జెట్‌పై హర్షం వ్యక్తం చేస్తున్నారు.