పరిటాల తర్వాత... జేసీ మళ్లీ భయపడ్డారా?

Narayana Molleti

ప్రస్తుతం ఏపీలో బాగా ఒత్తిడి ఎదుర్కొంటున్న టీడీపీ నాయకుల్లో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఒకరు. గనుల లీజు రద్దు, బస్సుల సీజ్‌, తప్పుడు పత్రాలతో లారీల కొనుగోళ్లు ఇలా వరుసగా జేసీ కుటుంబం మెడకు ఏదో ఒక వ్యవహారం చుట్టుకుంటూనే ఉంది. కొందరు జేసీ పరిస్థితిని కోడెల శివప్రసాదరావు పరిస్థితితోనూ పోల్చి చూస్తున్నారు.  జేసీ మాత్రం ధైర్యంగానే నిలబడుతూ వస్తున్నారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా జేసీ దివాకర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికలపై భయాన్ని బయటపెట్టారు. లోకల్‌లో కరెన్సీ పంచినా, లిక్కర్ తాగించినా అనర్హత వేటు, మూడేళ్ల జైలు శిక్ష అంటూ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం తెచ్చిన ఆర్డినెన్స్‌పై జేసీ ఆందోళన వ్యక్తం చేశారు. 

 

 

డబ్బులు పంచినట్టు, మద్యం పంపిణీ చేసినట్టు తేలితే గెలిచిన అభ్యర్థిని కూడా అనర్హుడిగా ప్రకటించేలా పదునైన ఆర్డినెన్స్‌ ను చూసి జేసీ అస్త్ర సన్యాసం బెటర్ అని ప్రకటించారు. డబ్బులు, లిక్కర్ పంచినప్పుడు పట్టుకుంటే పర్వాలేదు గానీ... గెలిచిన తర్వాత కూడా అనర్హత వేటు వేస్తామని చెప్పడం ముమ్మాటికి హోల్‌సేల్‌గా ఏకగ్రీవం చేసుకునే ఎత్తుగడే అని జేసీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోటీ చేయడం, గెలవడం, గెలిచిన తర్వాత డబ్బు పంచారంటూ పదవులు ఊడబెరుక్కోవడం అవసరమా అని జేసీ ప్రశ్నించారు. అందుకే  తాడిపత్రి మున్సిపల్‌ ఎన్నికల్లో గానీ, తాడిపత్రి నియోజవర్గంలోని ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో గానీ తాము పోటీ చేయబోమని జేసీ ప్రకటించారు. 

 

 

ఇలా జేసీ దివాకర్ రెడ్డి లోకల్ బాడీ ఎలక్షన్‌లో అస్త్ర సన్యాసం చేసిన ఉదంతం గతంలోనూ ఉంది. పరిటాల రవి మంచి ఫాంలో ఉన్నప్పుడు, ఆయన కత్తి బాగా తెగుతున్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి ఎదురెళ్లకుండా తెలివిగా మౌనం పాటించారు. అనంతపురం జిల్లాను రాజకీయంగా తన చెప్పుచేతల్లో తీసుకునే ఆపరేషన్ మొదలుపెట్టిన పరిటాల రవి ఒక దశలో తాడిపత్రిలో జేసీ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఆ సమయంలోనే మున్సిపల్ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు జేసీ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. అయినా సరే మున్పిపల్ ఎన్నికల్లో పోటీ చేయకుండా జేసీ వర్గం దూరంగా ఉండిపోయింది. 

 

 

ఎన్నికల్లో తమ వర్గం పోటీ చేస్తే పరిటాల వర్గీయులు హత్యలు చేయించడంతో పాటు, తన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డిని కేసుల్లో ఇరికించాలన్న ఆలోచన చేశారని అందుకే ఆరోజు తాము ఎన్నికల్లో పోటీ చేయలేదు అని  జేసీ దివాకర్ రెడ్డి స్వయంగా  పలుమార్లు చెప్పారు. ఇప్పుడు అనంతపురం జిల్లాలో గానీ, తాడిపత్రిలో గానీ  హత్యలు చేసుకుని పరిస్థితి లేదు. అయినప్పటికీ కేసులకు దడిసి జేసీ వర్గం లోకల్‌లో వెనుకడుగు వేస్తున్నట్టుగా ఉంది. విచిత్రం ఏమిటంటే... మొన్నటి సాధారణ ఎన్నికల్లో బాగానే డబ్బులు ఖర్చు పెట్టిన జేసీ దివాకర్ రెడ్డి... డబ్బు రాజకీయాలు చాలా భారంగా మారాయని... డబ్బులు లేకుండా ఎన్నికలు జరిగే పరిస్థితి ఉండాలంటూ హంగామా చేశారు. మేధావులను, లోక్‌సత్తా జేపీ లాంటి వారిని కలిసి డబ్బు రహిత రాజకీయం చేయడం ఎలా అన్న దానిపై ఉద్యమం చేసేందుకు ఆ మధ్య జేసీ ప్రయత్నించారు. కానీ ఇప్పుడు అదే జేసీ దివాకర్ రెడ్డి స్థానిక ఎన్నికల్లో డబ్బులు పంచారు, సారాయి పంచారు అని కేసులు పెట్టి, అనర్హత వేటు వేయడం ఏమిటి అని అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

 

 

ఇప్పటికే పలు కేసుల్లో ఇరుక్కుంటూ ఒత్తిడిలో ఉన్న జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం... స్థానిక సంస్థల ఎన్నికలను ఎదుర్కొనే విషయంలో వెనుకాడుతోంది. కాకపోతే తాడిపత్రి మున్పిపాలిటీలో గానీ, నియోజకవర్గంలో గానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయబోమని జేసీ దివాకర్ రెడ్డి చెబుతున్నా... అందుకు చంద్రబాబు అంగీకరిస్తారా అన్నదే పెద్ద ప్రశ్న. ఎందుకంటే గతంలో జేసీ కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు తాడిపత్రి వరకు ఆయన నిర్ణయమే ఫైనల్. కానీ ఇప్పుడు చంద్రబాబు మరీ అంత స్వేచ్చ జేసీ దివాకర్ రెడ్డి ఫ్యామిలీకి ఇవ్వకపోవచ్చు. పైగా వైసీపీపైకి దివాకర్ రెడ్డిని మరింత ఉసిగొల్పేందుకే చంద్రబాబు ప్రయత్నించవచ్చు. కాబట్టి అయిష్టంగానైనా...  టీడీపీలో ఉన్నారు కాబట్టి స్థానిక బరిలో జేసీ కుటుంబం ముందుండి నడిపించాల్సిన పరిస్థితి తప్పకపోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: