కరోనా ఎఫెక్ట్... దేశానికే అధినేత షేక్ హ్యాండ్ ఇస్తే పక్కకు జరిగిన మంత్రి...!

Reddy P Rajasekhar

దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. కేంద్ర మంత్రి హర్షవర్ధన్ దేశంలో ఇప్పటివరకు 28 మందికి కరోనా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు. ఢిల్లీలో పాజిటివ్ వచ్చిన వ్యక్తి కుటుంబానికి, ఆగ్రాలో నివశిస్తున్న ఆరుగురికి కరోనా నిర్ధారణ అయిందని తెలిపారు. విదేశీయులు వెనక్కు వెళ్లాలన్నా ఆయా దేశాలు రానివ్వడం లేదని వారిని ప్రత్యేక క్యాంపుల్లో ఉంచామని వైద్యులు చెబుతున్నారు. 
 
కరోనా సామాన్యులకే కాదు దేశాధినేతలకు సైతం సోకుతూ వారిని భయభ్రాంతులకు గురి చేస్తోంది. ఇరాన్ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్ కు కరోనా సోకడం ప్రపంచాన్నే నివ్వెరపరిచింది. వైద్య నిపుణులు ఇతరుల కళ్లు, ముక్కు, నోరు, చేతులను తాకవద్దని ప్రజలకు సూచిస్తున్నారు. కరోనా భయంతో కొన్ని దేశాలలో దేశాధినేతలు షేక్ హ్యాండ్ ఇచ్చినా పక్కకు జరుగుతున్నారు. 
 
తాజాగా జర్మనీలో అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. జర్మనీ అధినేత ఏంజెలా మెర్కెల్ దేశ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రి హోర్ట్స్ సీహోవర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు చేయి చాచారు. కానీ ఆయన మాత్రం షేక్ హ్యాండ్ ఇవ్వకుండా చిరునవ్వు నవ్వి ఊరుకున్నారు. మొదట కొంత అసహనానికి గురైన ఏంజెలా మెర్కెల్ ఆ తర్వాత మంత్రి పరిస్థితిని అర్థం చేసుకొని శాంతించారు. 
 
మరోవైపు దేశీయ స్టాక్ మార్కెట్లపై కరోనా ప్రభావం పడుతోంది. ఈరోజు ఉదయం లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యాహ్నానికి నష్టాల్లోకి వెళ్లాయి. కరోనా ప్రభావంతో పాటు ఇండియా, అమెరికా సర్వీసులలోని పీ.ఎం.ఐ డేటా రానుండటం కూడా మార్కెట్లపై ప్రభావం చూపిందని సమాచారం. చైనా కంటే సాంకేతికంగా, ఆర్థికంగా భారత్ వెనుకబడి ఉండటంతో ఇక్కడ కరోనా వ్యాపిస్తే కష్టమనే భయాలు ఎక్కువగా ఉన్నాయి. కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీలు ఉద్యోగులను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని ఆదేశించాయి. ఎప్పుడూ హడావిడిగా కనిపించే మైండ్ స్పేస్ కరోనా ఎఫెక్ట్ తో నిర్మానుష్యంగా మారింది. 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: