ఆవేశం తగ్గించుకోరా తమ్ముళ్లూ ?
మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు గా తయారయింది తెలుగుదేశం పార్టీ వ్యవహారం. ఇప్పటికే ఆ పార్టీ పుట్టెడు కష్టాల్లో ఉన్నా ఆ పార్టీ నాయకులు మాత్రం ఇంకా తాము అధికారంలోనే ఉన్నాము అన్న భ్రమలో ఉన్నారు. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు మౌనంగా ఉండడం బెటర్ అన్న సూత్రాన్ని మరిచిపోయి వీరావేశంతో విరుచుకుపడుతూ తిప్పలు కొనితెచ్చుకుంటున్నారు. అయ్యో పాపం అని అందాం అంటే వీరి నోరు ఎక్కడా అదుపులో ఉండడం లేదు. అధికార పార్టీని ఉద్దేశించి, ఆ పార్టీ అధినేత జగన్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తూ అడ్డు అదుపు లేకుండా తమ నోటికి పని చెబుతున్నారు. వారినే కాదు గ్రామ వాలంటీర్ల దగ్గర నుంచి ఉన్నత స్థాయి అధికారుల వరకు అందరి మీద విమర్శలు చేస్తూ బూతు పురాణం విప్పుతున్నారు.
ఒకరు కాదు ఇద్దరు కాదు గత టిడిపి ప్రభుత్వంలో హవా నడిపించిన ప్రతినాయకుడు ఇదే విధంగా వ్యవహరిస్తుండడం, చిక్కుల్లో పడడం పరిపాటిగా మారింది. బోండా ఉమామహేశ్వర రావు, దేవినేని ఉమా, అచ్చెన్నాయుడు, కూన రవి కుమార్ ఇలా అనేకమంది నాయకులు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ చిక్కులో పడుతున్నారు. ప్రస్తుతం మాజీ విప్ కూనా రవి కుమార్ ఓ అధికారిని దూషించిన కేసులో అరెస్ట్ అయ్యారు. కూన రవికుమార్ స్వయంగా ఏపీ స్పీకర్ తమ్మినేని సీతారాం సొంత మేనల్లుడు. ఆయన గత ప్రభుత్వంలో విప్ గా తన హవా నడిపించారు. అప్పట్లోనే ఆయన అధికారులతో దురుసుగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదులు కూడా వచ్చాయి.
ఇప్పుడు ఆయన కానీ, ఆయన పార్టీ గాని అధికారం లేదు. అయినా ఆయన మాత్రం తన పాత పంథాను వీడలేదు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలోని సరుబుజ్జిలి మండలం ఈవో పీఆర్డీ అప్పలనాయుడు కి ఫోన్ చేసిన కూన.. ఆ సందర్భంగా ఆ అధికారిని ఉద్దేశించి నోటి దురుసు ప్రదర్శించడం, సదరు అధికారి కూన మాటలను సెల్ లో రికార్డ్ చేయడంతో ఆయన అప్పుడు కటకటాల పాలయ్యారు. ఇదంతా తెలుగుదేశం పార్టీకి ఒక గుణపాఠంగా కనిపిస్తోంది. అధికారం .. అవకాశం లేనప్పుడు సైలెంట్ గా ఉండాలి తప్ప ఇష్టమొచ్చినట్టుగా చెలరేగిపోతే ఫలితాలు ఇలాగే చేదుగా ఉంటాయి.