50 ఏళ్లుగా గోదావరి జలాల్లోనే నీలకంఠుడు !
ఆ శివాలయానికి ఒక ప్రత్యేకత ఉంది. ఒకటి కాదు రెండు కాదు అక్కడ ఏకంగా 50 ఏళ్ల నుంచి నీళ్లలోనే కొలువున్నాడు ఈశ్వరుడు. సాక్షాత్తూ పరమేశ్వరుని తలలోనే గంగ కొలువై ఉంటే...ఇక్కడ మాత్రం నిత్యం గోదావరి జలాలతో అభిషేకం అందుకుంటున్నాడు మహాశివుడు.
నిజామాబాద్ జిల్లా కుస్తాపూర్ వద్ద గోదావరి నదిలో ఉంది శ్రీరామలింగేశ్వరుడి ఆలయం. శ్రీరాముడు వనవాస కాలంలో అయోధ్య నుంచి భద్రాచలం వెళ్తుండగా కుస్తాపూర్‌లో బస చేశాడని చెబుతారు. గోదావరి నది దక్షిణ దిశగా ఎక్కడ ప్రవహిస్తుందో అక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాలని వశిష్ఠుడు శ్రీరామునికి చెప్పాడని.... అప్పుడు శ్రీరాముడు హనుమంతునికి కాశీ నుంచి స్వర్ణలింగాన్ని తీసుకురావాలని ఆజ్ఞాపించాడట. అయితే హనుమంతుడు ముహూర్త సమయానికి లింగం తీసుకురాలేకపోయాడట. ముహూర్త బలం తెలిసిన శ్రీరాముడు ఇసుకతో లింగాన్ని తయారుచేసి ఇక్కడ ప్రతిష్ఠించాడని స్థానికులు చెబుతారు.
ఇక...శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో తొమ్మిది గ్రామాలు ముంపునకు గురయ్యాయి. అందులో కుస్తాపూర్ కూడా ఒకటి. ఆ గ్రామం పరిధిలోనే ఈ శివాలయం ఉండేది. ముంపునకు గురైన ఈ ఆలయం నుంచి నందీశ్వరున్ని ఇతర విగ్రహాలను తీసుకువచ్చి పోచంపాడులోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కాలనీలో ఉన్న శివాలయంలో ప్రతిష్ఠించారు. లింగం మాత్రం ఎంత కష్టపడి తీసినా రాలేదట. దీంతో స్థానికులు లింగాన్ని మాత్రం అక్కడే ఉంచేశారు.
2015లో గోదావరికి అంతగా వరదలు రాలేదు. ఫలితంగా నదిలో జలకళ తప్పింది. ప్రాజెక్టు సైతం నీళ్లు లేక వెలవెలబోయింది. ఈ ప్రాజెక్టు కారణంగా ముంపునకు గురైన పురాతన ఆలయాలు... బయటపడ్డాయి. ప్రాజెక్టు మధ్యలోని శ్రీరామలింగేశ్వర ఆలయం మళ్లీ కనిపిస్తుందని తెలిసి స్థానికులు అక్కడికి వెళ్లారు. ఆలయం పూడికతో నిండిపోయింది. స్థానికులు అక్కడికి చేరుకొని ఆలయ ద్వారాలు తెరిచారు. శుభ్రం చేయించారు. ఆలయానికి పెద్ద ఎత్తున వచ్చిన భక్తులు పూజలు చేశారు. ఈ ఆలయం గురించి చరిత్రకారులు పరశోధన చేశారు.
2019లో మరోసారి శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరింది. పూర్తిగా నీళ్లు అడుగంటిపోయాయి. దీంతో మరోసారి ఆలయం బయటపడింది. నిజానికి...50 ఏళ్లలో కేవలం రెండు మూడు సార్లే బయటపడింది శ్రీరామలింగేశ్వరుని ఆలయం. 2019లో మరోసారి బయల్పడటంతో...చాలా మందికి ఈ ఆలయం ఉందన్న సంగతి తెలిసింది. ఇలా బయటికి ఆలయం కనిపించినప్పుడల్లా ఆ రామలింగేశ్వరుడిని దర్శించుకొని వెళ్తుంటారు భక్తులు.మొత్తానికి...ఎప్పుడో ఒకసారి కనిపించే ఈ ఆలయం పరమ శివుడి మహత్మ్యానికి ప్రతీకగా చెప్పుకుంటారు భక్తులు.