ఒక ఐడియాతో.. వ్యక్తినే కాదు సమాజాన్నీ మార్చేస్తోన్న.. `మైక్రో` దిగ్గజం.. కోటిరెడ్డి ...!
దారి కనిపించని స్థితి నుంచి పదిమందికి దారి చూపించే స్థాయికి ఎదిగిన కోటిరెడ్డికి తట్టిన ఒకే ఒక ఐడి యా తనతోపాటు ఈ సమాజాన్ని కూడా మారుస్తోంది. ఏపీలోని కృష్ణాజిల్లాలో ఉన్న గుడివాడ నియోజకవర్గంలోని నందివాడ మండలం జనార్థనపురం గ్రామానికి చెందిన సరిపల్లి కోటిరెడ్డి.. తన జీవన పయనంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. వ్యవసాయ కుటుంబానికి చెందిన కోటిరెడ్డి ఫ్యామిలీ పెద్దది. ఇద్దరు అక్కలు, తను, తండ్రి. తల్లి. తండ్రి వ్యవసాయం చేయగా వచ్చే చిన్నపాటి సంపాదనతోనే ఇల్లు గడవాలి. ఆ డబ్బు నుంచే ఇద్దరు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేయాలి. దీంతో కోటిరెడ్డి చదువు.. పది వరకే ఆగిపోయింది. నిజానికి పదిలో కోటిరెడ్డి టాప్ అయినా..కుటుంబ ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో ఆయన పనిచూసుకోకతప్పలేదు.
అయితే, సాధారణ వ్యక్తిగా కోటిరెడ్డి ఆపనిలో నిమగ్నమై.. తండ్రికి చేదోడుగా ఉండిపోయి.. వచ్చిన నాలుగు డబ్బులతోనే సరిపుచ్చుకుని ఉంటే.. నేడు ఇలా మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. కానీ, ``జీవితం అంటే.. నేను బతకడమేనా?``- ``ఇలా బతికేయడమేనా?``- అనే ఆలోచనలు కోటిరెడ్డిలో భవిష్యత్తుపై ఆశలు పెంచాయి. అదే చిన్నగా ప్రారంభమై.. తన జీవితాన్ని మార్చే దిశగా అడుగులు వేయించింది. మైక్రోసాఫ్ట్‌లో ఉద్యోగం.. చేతినిండా డబ్బులు.. సమస్యలు తీరాయి.. ఇంకేముంది.. ఇది చాలు! సాధారణ యువత అక్కడితో సరిపుచ్చుకుంటారు. కానీ, మనం పైన చెప్పుకొన్న ఏదో సాధించాలనే కాన్సెప్ట్ కోటిరెడ్డిని ముందుకు నడిపించింది.
అక్కడ నుంచి బయటకు వచ్చి ఈ రోజు 14 కంపెనీలతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి ఆయన సేవలు అందిస్తున్నారు. ఈ రోజు ఆయన కంపెనీల సేవలు ప్రపంచంలోని 70 కోట్ల మందికి చేరువ అవుతున్నాయి. ఎంతో మందికి ఉపాధి ఇస్తున్నారు. కాని నాడు కోటిరెడ్డి ఆ ధైర్యం, తెగువ చూపి మైక్రోసాఫ్ట్‌లోనే ఉండి తన జీవితం వరకే చూసుకున్నట్లయితే ఇన్ని కంపెనీలు.. ఇంత మందికి ఉపాధి.. దేశ విదేశాల్లో ఆయన సేవలు ఉండేవే కాదు. ప్రస్తుతం ఆయన వ్యక్తిగా కాదు.. ఓ ఆలోచనగా.. ఈ ప్రపంచానికి చేరువయ్యారు. సో.. ఒక ఐడియా.. వ్యక్తినే కాదు సమాజాన్నీ మార్చేస్తోంది... అనడానికి కోటిరెడ్డి ప్రత్యక్ష సాక్ష్యం.