ఉల్లి వినియోగదారులకు శుభవార్త... భారీగా తగ్గిన ఉల్లి ధరలు.. కిలో ఎంతంటే...?
గడచిన నాలుగు నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉల్లి పెట్టిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కిలో 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు పలకడంతో వినియోగదారులకు కోసే సమయంలో కంటే కొనే సమయంలోనే కన్నీళ్లు వచ్చాయి. కానీ సంక్రాంతి పండుగ తరువాత నుండి ఉల్లి ధరలు తగ్గుముఖం పట్టాయి. ప్రస్తుతం ఉల్లి ధరలు భారీగా తగ్గి ఉల్లి ప్రజలకు అందుబాటు ధరలోకి రావడం గమనార్హం.
ఉల్లి దిగుమతులు రోజురోజుకు పెరుగుతూ ఉండటంతో ఉల్లిధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్ లో క్వింటా ఉల్లి 2000 రూపాయల నుండి 3000 రూపాయల వరకు పలుకుతోంది. ఉల్లి ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతూ ఉండటంతో సామాన్యులు ఊపిరి పీల్చుకుంటున్నారు. రిటైల్ మార్కెట్లలో కిలో ఉల్లిని 23 రూపాయల నుండి 35 రూపాయల వరకు విక్రయిస్తున్నారు.
రానున్న రోజుల్లో ఉల్లిధరలు మరింత తగ్గుముఖం పట్టనున్నాయని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాలలో వ్యాపారులు 100 రూపాయలకు మూడు కిలోలు, 100 రూపాయలకు 4 కిలోలు చొప్పున ఉల్లిని విక్రయిస్తున్నారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం ఉల్లి దిగుమతులు భారీగా పెరిగాయని అందువలన ఈ సంవత్సరం ఇతర రాష్ట్రాల ఉల్లిపై ఆధారపడాల్సిన అవసరం కూడా లేదని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
కొత్త పంట అందుబాటులోకి రావడంతో ఉల్లి ధర తగ్గుముఖం పట్టిందని ఈ ఏడాది ఉల్లిధర పెరిగే అవకాశాలు లేవని వ్యాపారులు చెబుతున్నారు. కర్నూలు, గుంటూరు, మలక్ పేట్ మార్కెట్లకు భారీగా ఉల్లి దిగుమతి అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ నెలాఖరుకు కిలో ఉల్లి 20 రూపాయలకు చేరే అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయని తెలుస్తోంది. ఉల్లిధరలు తగ్గుముఖం పడుతూ ఉండటం పట్ల వినియోగదారుల నుండి హర్షం వ్యక్తమవుతోంది.