హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: టీడీపీలో ‘ఒక్కడు’
కృష్ణా జిల్లా అనగానే ఎక్కువగా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా చూస్తారు. ఆ పార్టీ అధికారంలో రావడానికి ఈ జిల్లానే కీలక పాత్ర పోషిస్తుంది. 2014లో కూడా టీడీపీకి మెజారిటీ సీట్లు వచ్చాయి. అయితే 2019 ఎన్నికలకు వచ్చేసరికి పరిస్తితులు ఒక్కసారిగా మారిపోయాయి. జిల్లాలోని 16 సీట్లలో వైసీపీ 14 గెలుచుకుంటే టీడీపీ 2 మాత్రమే గెలుచుకుంది. ఇక తర్వాత గన్నవరం నుంచి గెలిచిన వల్లభనేని వంశీ, టీడీపీని వీడి వైసీపీకి మద్ధతు తెలిపారు.
దీంతో జిల్లాలో టీడీపీకి ఒక్క ఎమ్మెల్యేనే మిగిలారు. విజయవాడ తూర్పు నుంచి గెలిచిన గద్దె రామ్మోహన్ ప్రస్తుతం టీడీపీలో ఒకేఒక్కడు అన్నట్లు ఉండిపోయారు. 2009లో ఇదే నియోజకవర్గం నుంచి ఓడిపోయినా..రామ్మోహన్ 2014లో మంచి మెజారిటీతో గెలిచారు. ఇక టీడీపీ కూడా అధికారంలో ఉండటంతో ఆయన నియోజకవర్గంలో బాగానే పని చేశారు. ప్రజలకు అందుబాటులో ఉండటం వల్లే 2019 ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్న 15వేల పైనే మెజారిటీతో గెలిచారు.
ఇక ప్రతిపక్ష ఎమ్మెల్యేగా తనకు సాధ్యమైన పనులు చేస్తున్నారు. అధినేతతో కలిసి అధికార పక్షంపై పోరాడుతున్నారు. ఇక విజయవాడ ఎంపీగా కేశినేని నాని ఉండటంతో, పార్లమెంట్ నిధులు ద్వారా నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు చేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమ పథకాలని తమ నియోజకవర్గ ప్రజలకు అందేలా చూసుకుంటున్నారు. పథకాలు ఏదైనా అందకపోతే ఆ సమస్యలని అధికారులు దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చూస్తున్నారు.
ఇక రాజధాని అమరావతికి దగ్గర ఉండటం వల్ల నియోజకవర్గ ప్రజలు కాస్త మూడు రాజధానులని వ్యతిరేకిస్తున్నారు. ఇటు గద్దె అమరావతి కోసం కూడా పోరాడటం ఆయనకు కలిసొచ్చే అంశం. అయితే ఇదే సమయంలో తూర్పులో పట్టున్న దేవినేని అవినాష్ వైసీపీలోకి వెళ్ళి, నియోజకవర్గ ఇన్ చార్జ్ కావడం వల్ల భవిష్యత్‌లో గద్దెకి ఇబ్బంది ఎదురయ్యే అవకాశముంది. పైగా దేవినేని నియోజకవర్గంలో ప్రజలు కష్టాలని పరిష్కరించడంలో ముందున్నారు. ఈ పరిణామాలు చూస్తుంటే గద్దెకి అవినాష్ రూపంలో ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తుంది.