ఆ రెండు బిల్లులు సెలక్ట్ కమిటీకి చేరే క్రమంలో..!

NAGARJUNA NAKKA

ఆంధ్రప్రదేశ్ రాజధాని వికేంద్రీకరణ బిల్లు.. సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లు సెలెక్ట్‌ కమిటీకి పంపే అంశం అనేక టర్నింగులు తిరిగే సూచనలు కన్పిస్తున్నాయి. సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటు విషయంలో మంత్రి బొత్స కీలక కామెంట్లు చేశారు. సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటు విషయంలో ఓవైపు కసరత్తు జరుగుతోందంటూ మండలి ఛైర్మన్‌ ప్రకటించినా.. నిబంధనల ప్రకారమే అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరిస్తారంటూ బొత్స స్పష్టంగా చెప్పేశారు. ఈ క్రమంలో బిల్లులు సెలెక్ట్‌ కమిటీకి వెళ్తాయా...? లేదా..? అనేది ఉత్కంఠగా మారింది.

 

ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు.. సీఆర్డీఏ చట్ట ఉప సంహరణ బిల్లులను సెలెక్ట్‌ కమిటీలకు పంపామని మండలి ఛైర్మన్‌ స్పష్టంగా చెప్పారు. అయితే సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు సంబంధించి సభ్యుల పేర్లు ఇవ్వాల్సిందిగా ఆయా పార్టీలకు లేఖలు రాస్తామని చెప్పినా.. ఇప్పటికీ ఆ ప్రక్రియ ఇప్పటికీ ప్రారంభం కాలేదు. పార్టీలకు లేఖలు చేరలేదు. ఇదే క్రమంలో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు సంబంధించి తమకు ఎటువంటి సమాచారం లేదంటూ అసెంబ్లీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే సందర్భంలో సెలెక్ట్‌ కమిటీ ఏర్పాటు విషయంలో అసెంబ్లీ కార్యదర్శిపై అధికార-ప్రతిపక్ష పార్టీలు ఒత్తిడి పెంచుతున్నాయనే చర్చ గత కొంత కాలంగా జరుగుతోంది. దీని కారణంగానే సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన లేఖలు ఇంకా పార్టీలకు వెళ్లలేదనే ప్రచారమూ జరుగుతోంది. ఈ క్రమంలో మంత్రి బొత్స, మండలి ప్రతిపక్ష నేత యనమల చేసిన కామెంట్లు కొత్త చర్చకు దారి తీశాయి.

 

సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను అసెంబ్లీ కార్యదర్శి వెంటనే ప్రారంభించాలని.. మండలి ఛైర్మన్‌ స్వయంగా ఆదేశాలు జారీ చేసినా.. ఎందుకు ఆ ప్రక్రియ పాటించడం లేదంటూ యనమల సీరియస్‌ అయ్యారు. ఇది సభా హక్కుల ఉల్లంఘనకు వస్తుందంటూ హెచ్చరించారు. అధికార పార్టీ ఇచ్చే ట్విస్టులు ఈ విషయంలో కుదరదంటూ ఎద్దేవా చేశారు యనమల. దీనికి మంత్రి బొత్స కూడా గట్టి కౌంటరే ఇచ్చారు. అధికారులు నిబంధనల ప్రకారం వ్యవహరిస్తారని.. మండలి ఛైర్మన్‌ షరీఫ్‌ ఇచ్చిన ఆదేశాలు నిబంధనల ప్రకారం లేవని అశెంబ్లీ కార్యదర్శి భావిస్తే.. వాటిని అమలు చేయాల్సిన అవసరం లేదనే విషయాన్నిస్పష్టంగా చెప్పేశారు బొత్స. 

 

దీంతో సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియ మాత్రం కొంచెం కూడా ముందుకు కదలడం లేదు. దీంతో ఈ రెండు బిల్లులు అసలు సెలెక్ట్‌ కమిటీల ముందుకు వెళ్తాయా..? లేదా..? అనే కొత్త చర్చ ఇప్పుడు మొదలైంది. ఇదే కనుక జరిగితే ఈ బిల్లుల వ్యవహరం ఎలాంటి టర్న్‌ తీసుకుంటుందోననే ఆసక్తి నెలకొంది. ప్రస్తుతమున్న పరిస్థితుల్లో అసెంబ్లీ కార్యదర్శి సెలెక్ట్‌ కమిటీల ఏర్పాటుకు ప్రక్రియ ప్రారంభిస్తారా..? లేదా..? అనే ఉత్కంఠ నెలకొంది. అసెంబ్లీ కార్యదర్శి ఈ ప్రక్రియను ప్రారంభించకుంటే.. మండలి ఛైర్మనే ఈ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంటుందా..? అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: