ఔరా... కరోనాకు భారతీయ వైద్యం.. మందు సూచించిన కేంద్ర ఆయుష్ శాఖ... !
కరోనా వైరస్... ఈ వైరస్ పేరు వింటే చాలు ప్రపంచంలోని దేశాల ప్రజలంతా భయంతో వణికిపోతున్నారు. చైనాలోని వుహాన్ నగరంలో బయటపడిన ఈ వైరస్ వలన ఇప్పటికే 100 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. భారత్ లో అధికారికంగా ఇప్పటివరకూ కరోనా వైరస్ కేసులు నమోదు కాకపోయినా కరోనా వైరస్ అనుమానితుల కేసులు మాత్రం రోజురోజుకు పెరిగిపోతున్నాయి.
ఇలాంటి తరుణంలో కరోనా వైరస్ బారిన పడికుండా పాటించవలసిన జాగ్రత్తలను, వ్యాధి రాకుండా నిరోధించే ఔషధాలను భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచిస్తూ ప్రకటన చేసింది. యునానీ, హోమియోపతి ఔషధాలు కరోనా వైరస్ ద్వారా తలెత్తే ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా ఎదుర్కొంటాయని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది. సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ హోమియోపతి సలహా మండలి హోమీయోపతి ద్వారా కరోనా వైరస్ ప్రభావాన్ని ఎదుర్కొనే విధానాలు గురించి చర్చకు సమావేశమైంది.
ఆర్సెనికం ఆల్బమ్ 30 అనే హోమియోపతి మందును ఖాళీ కడుపుతో మూడు రోజుల పాటు తీసుకుంటే కరోనా నుండి రక్షణ పొందవచ్చని ఆయుష్ మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఆయుష్ అధికారులు రోగ నిరోధక ఔషధంగా ఆర్సెనికం ఆల్బమ్ 30 పని చేస్తుందని అన్నారు. ఈ మందుల ప్రభావం శరీరంపై నెల రోజుల పాటు ఉంటుందని అప్పటికీ వ్యాధి వ్యాప్తిలో ఉంటే మరోసారి మందులు వేసుకోవాలని ఆయుష్ మంత్రిత్వ శాఖ సూచించింది.
ఆయుష్ శాఖ అధికారులు మాట్లాడుతూ కరోనా వైరస్ ద్వారా కలిగే ఇన్ఫెక్షన్లను నిరోధించటానికి ఆయుర్వేద, యునానీ ఔషధాలు మరియు చిట్కాలు కూడా ప్రభావవంతంగా పని చేస్తాయని చెప్పారు. కరోనా వైరస్ ను కొన్ని జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా కొంతవరకు నిరోధించవచ్చు. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవటం, బహిరంగ ప్రదేశాల్లో తిరిగే సమయంలో ఎన్ 95 మాస్కులు ధరించటం, జనసమూహం ఉండే ప్రదేశాలకు దూరంగా ఉండటం, జలుబు, దగ్గు లక్షణాలు కనిపిస్తే వారికి దూరంగా ఉండటం, ఇతర జాగ్రత్త చర్యలతో కరోనా వైరస్ ను కొంతవరకు నిరోధించవచ్చు.