కాపు కాసిన జగన్..పవన్-కన్నా కథ కంచికే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక ఓట్లు గల సామాజికవర్గం బీసీలే అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే బీసీలలో ఉన్న అన్ని కులాలని కలుపుకుంటేనే, వారి ఓట్ల శాతం ఎక్కువ. అలా కాకుండా అత్యధిక ఓటింగ్ గలవారు కాపులు(కాపు, ఒంటరి, బలిజ, తెలగ) మాత్రమే. దాదాపు వీరు 28 శాతం వరకు ఉన్నారు. వీరికున్న ఓటింగ్ శాతం బట్టి చూస్తే...ఏ ప్రభుత్వామైన ఏర్పాటు కావాలంటే వీరి మద్ధతు తప్పనిసరి ఉండాలి. 2014 ఎన్నికల్లో అత్యధిక శాతం కాపులు టీడీపీకి మద్ధతు తెలపడం వల్లే, చంద్రబాబు సీఎం అవ్వగలిగారు.
ఇక వారికి తగిన న్యాయం చేయకపోవడం వల్ల 2019 ఎన్నికల్లో కాపులు మెజారిటీ జగన్‌కు సపోర్ట్ చేశారు. ఫలితంగా ఆయనకు భారీ మెజారిటీ వచ్చింది. కొందరు కాపులు టీడీపీ, జనసేనలకు మద్ధతు తెలిపారు. అయితే ఈ కాపు ఓట్లని మరింత దగ్గర చేసుకునేందుకు జనసేన, బీజేపీలు కలిసి ఓ వ్యూహంతో ముందుకెళుతున్నారు. అది ఏంటంటే మామూలుగా వైసీపీకి రెడ్లు, టీడీపీకి కమ్మ సామాజికవర్గం మద్ధతు చాలా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు కాపులని తమకు అండగా ఉండేలా చేసుకోవాలని జనసేన-బీజేపీలు పొత్తు పెట్టుకున్నాయి.
పైగా జనసేన అధినేత పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ ఇద్దరు కాపు నేతలే. దీంతో మరింతగా కాపులు మద్ధతు దక్కుతుందని ప్లాన్ చేస్తున్నారు. అయితే వీరి వ్యూహానికి ధీటుగా జగన్ కాపులని ఇంకా ఎక్కువగా తనవైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు కాపులకు చాలా సంక్షేమ పథకాలు ఇచ్చారు. కాపు కార్పొరేషన్ పెట్టి వారిని ఆదుకుంటున్నారు. తాజాగా కాపు నేస్తం పేరిట 45-60 లోపు ఉన్న కాపు మహిళలకు ఏటా రూ. 15 వేలు చొప్పున ఇచ్చేందుకు సిద్ధమయ్యారు.
త్వరలోనే ఆ డబ్బులు వారి ఖాతాల్లో పడనున్నాయి. ఈ పథకం వల్ల కాపు ఫ్యామిలీల మద్ధతు మరింత పెరుగుతుంది. రానున్న రోజుల్లో కూడా కాపులకు మరిన్ని పథకాలు అందించనుండటంతో, పవన్-కన్నా పప్పులేమీ ఉడకవు. ఏదేమైనా జగన్ కాపు కాసేశారు..కాబట్టి పవన్-కన్నాల కథ కంచికే వెళ్లనుంది.