10 రూపాయలకే కడుపు నిండేంత భోజనం... కొత్త పథకానికి ప్రభుత్వం శ్రీకారం.. !

Reddy P Rajasekhar

దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించి మరొకటి లేదని పెద్దలు చెబుతూ ఉంటారు. అన్నదానం చేస్తే ఎంతో పుణ్యం కలుగుతుందని భావిస్తూ ఉంటారు. గత కొన్ని సంవత్సరాల నుండి పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వాలు కూడా కొత్త పథకాలను అమలులోకి తెస్తున్నాయి. మహారాష్ట్ర రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన శివసేన ప్రభుత్వం కూడా పేదల ఆకలి తీర్చటానికి 10 రూపాయలకే కడుపు నిండా భోజనం పెట్టే సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది.
 
రేపటినుండి 10 రూపాయలకే థాలి పేరుతో ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనుంది. ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయటం కొరకు నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ తో చేతులు కలిపింది. ఫేషియల్ రికగ్నైజేషన్ సాఫ్ట్ వేర్ ద్వారా అర్హులైన వారికి ప్రభుత్వం 10 రూపాయల థాలిని అందించనుంది. శివసేన ప్రభుత్వం మొదటి దశలో భాగంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మరియు ముంబైలోని 15 రద్దీ ప్రదేశాల్లో 10 రూపాయల థాలీని అందుబాటులో ఉంచనుంది. 
 
శివసేన పార్టీ మహారాష్ట్ర రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ముందు ఈ పథకాన్ని ప్రకటించింది. ఎన్నికల ముందు ఇచ్చిన హామీని శివసేన అధికారంలోకి రావడంతో అమలు చేస్తోంది. ఉద్దవ్ ఠాక్రే గతంలో పేదల కోసం ఈ పథకాన్ని అందుబాటులోకి తెస్తున్నట్టు ప్రకటన చేశారు. ఈ పథకం కింద ప్రజల ఆదాయాలను ఏ విధంగా ధ్రువీకరిస్తారో ఎవరిని పేదలుగా పరిగణనలోకి తీసుకుంటారో అనే విషయాలు తెలియాల్సి ఉంది. 
 
మొదటి మూడు నెలలు మాత్రం ఆధార్ వివరాలను, ఫోటోను అందించి 10 రూపాయల థాలిని తినే అవకాశం ప్రభుత్వం కల్పించింది. భోజనంలో 150 గ్రాముల అన్నం, రెండు చపాతీలు, 10 గ్రాముల కూరగాయలు, 100 గ్రాముల పప్పు ఉంటాయని సమాచారం. ఈ భోజనం కొరకు కాంట్రాక్టర్లు 50 రూపాయలు ఖర్చు చేయనున్నారని 50 రూపాయలలో 40 రూపాయలు ప్రభుత్వం భరించనుందని తెలుస్తోంది. తమిళనాడులోని అమ్మ క్యాంటీన్ల నుండి స్పూర్తి పొంది శివసేన ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయనున్నట్టు తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: